శబరిమల (Sabarimala)లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. వారికి సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైనట్టు తీవ్ర ఆరోపణలు వస్తోన్న విషయం తెలిసిందే.. కాగా ఇప్పటికే ప్రతిపక్షాలు సైతం కేరళ ప్రభుత్వంపై విరుచుకుపడుతోన్నాయి. ఈ సమయంలో కేరళ (Kerala) హైకోర్టు దేవస్థానం బెంచ్..శబరిమలలో రద్దీ నిర్వహణ సమస్యపై సుమోటో కేసును స్వీకరించింది.. మండలం, మకరజ్యోతి కాలంలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు మండలం-మకరజ్యోతి కాలం నవంబర్ 17న ప్రారంభం కావడం వల్ల భక్తులు భారీగా పోటెత్తారు. ఫలితంగా రద్దీ నిర్వహణలో లోపం తలెత్తింది. ఆలయానికి వెళ్లే రహదారులపై ట్రాఫిక్ స్తంభించిపోతోంది. అందువల్ల వాహనాలను పంబా వరకు అనుమతించడం లేదు.. ఇక ప్రైవేటు వాహనాలను బోలక్కల్ (Bolakkal) వరకే అనుమతిస్తున్న అధికారులు అక్కడి నుంచి 22 కిలోమీటర్ల దూరంలోని పంబా (Pamba)కు ప్రభుత్వ బస్సుల్లో వెళ్లాలని సూచిస్తున్నారు.
భక్తుల రద్దీతో, ఇతర రాష్ట్రాల స్వాములు అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే, పందళం వలియకోయికల్ ధర్మశాస్త్ర ఆలయాన్ని దర్శించుకుని వెనుదిరుగుతోన్నారు. మరోవైపు భక్తులు పడుతోన్న ఇబ్బందులపై రిజిస్ట్రార్‌కు సుమారు 300కు పైగా కంప్లయింట్స్ వచ్చాయని హైకోర్టు (High Court) దేవస్థానం బెంచ్ తెలిపింది. ఈ అంశంపై స్పందించిన ప్రభుత్వం, రద్దీ నిర్వహణలో తలెత్తిన లోపాన్ని భక్తులు ఇబ్బందులుగా చిత్రీకరిస్తున్నారని బదులిచ్చింది.
మరోవైపు ఎరుమెలిలోని హోటళ్లలో ధరల బోర్డులు పెట్టడమే కాకుండా పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌కు, హైకోర్టు దేవస్థానం బెంచ్ సూచించింది. వీటితో పాటు పంచాయితీ కార్యదర్శికి సైతం పలు ఆదేశాలు జారీ చేసింది. పార్కింగ్ స్థలాల్లో అధిక డబ్బులు వసూలు చేయకుండా చూసుకోవాలని.. లైసెన్స్‌లు లేకుండా పార్కింగ్ స్థలాలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది.