సెప్టెంబర్-17న రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైక్యతా దినోత్సవాల్లో పాల్గోవాలని భారత రాష్ట్ర సమితి(Brs)శ్రేణులకు మంత్రి సూచించారు. సెప్టెంబర్ 17 భారత సమాఖ్యలో తెలంగాణ రాష్ట్రం విలీనమైందన్నారు. అందువల్ల సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినోత్సవంగా తెలంగాణ ప్రజలు జరిపుకుంటున్నారని అన్నారు.
హైదరాబాద్లో నిర్వహించే వేడుకల్లో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొంటారని చెప్పారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వమే పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహిస్తుందన్నారు. ఈ వేడుకల్లో మంత్రులు పాల్గొని జాతీయ జెండాను ఎగరవేస్తారని వెల్లడించారు. తెలంగాణ ప్రజలు అత్యంత సంబురంగా జరుపుకునే జాతీయ సమైక్యత దినోత్సవం పై కూడా కొన్ని పార్టీలు రాజకీయాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నాయన్నారు.
ప్రతి అంశానికి మతాన్ని జోడించి సమాజంలో చిచ్చుపెట్టేందుకు విచ్ఛిన్నకర శక్తుల కుట్రలు చేస్తున్నాయని అన్నారు. ఆ కుట్రలను గమనించి ప్రజలు జాగ్రత్తగా వుండాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గత పదేండ్లలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జోడెద్దుల్లాగా ముందుకు తీసుకు వెళ్తున్నామన్నారు. తద్వారా దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామని చెప్పారు.
1948 సెప్టెంబర్ 17 ఈ సువిశాల భారత్ లో తెలంగాణ అంతర్భాగం అయిందన్నారు. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి తెలంగాణ పరివర్తన చెందిన రోజని తెలిపారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17ను కూడా కొన్ని పార్టీలు వక్రీకరిస్తున్నాయన్నారు. తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలనే ఎత్తుగడలకు విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయని చెప్పారు.
అప్పటి చరిత్రతో, పరిణామాలతో సంబంధమే లేని అవకాశవాదులు తెలంగాణ చరిత్రేను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. అన్ని విషయాల్లో అత్యంత మేధో సంపత్తితో, క్రియాశీలతతో తెలంగాణ సమాజం చురుగ్గా స్పందిస్తుందన్నారు. ఇప్పుడు కూడా అదే చైతన్యాన్ని ప్రదర్శించి.. తెలంగాణను కలుషితం చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్న విచ్ఛిన్నకర శక్తుల కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.