తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల వార్‌లో ఖమ్మం నియోజకవర్గం (Khammam Constituency) హాట్ సెగ్మెంట్‌గా మారింది. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోరు రసవత్తరంగా సాగుతుంది. బీఆర్‌ఎస్ (BRS) అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar).. కాంగ్రెస్ (Congress) అభ్యర్థి, తుమ్మల నాగేశ్వర్ రావు (Tummala Nageshwar Rao) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వీరిద్దరూ పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తూ ఒకరిపై ఒకరు విమర్శల బురద చల్లుకుంటున్నారు..
ఈ క్రమంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. మంత్రి పువ్వాడ అజయ్‌పై ధ్వజమెత్తారు. ఖమ్మం నియోజకవర్గంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని.. వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు నమోదు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నగరంలో 45వ డివిజన్‌లో ఏర్పాటు చేసిన తుమ్మల మిత్ర మండలి సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ మంత్రి.. ఖమ్మం నగరంలో ఎక్కడికి వెళ్ళినా పువ్వాడ అరాచకాల గురించి చెప్పడం సిగ్గుచేటని అన్నారు..
సామినేని సాయి గణేష్ అనే యువకుని ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నారని అన్న తుమ్మల.. మంత్రి అవినీతిని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించినందుకు గణేష్ పై అక్రమ కేసులు పెట్టి వేధించి, అతని ఆత్మ హత్యకు కారణం అయ్యారని తెలిపారు. మంత్రి ఆరాచకాలు తగ్గాలంటే బీఆర్ఎస్ ను ఇంటికి పంపాలని.. పువ్వాడకు బైబై చెప్పాలని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇక్కడి ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు..