తెలంగాణ (Telangana)లో నీటి కొరత ఏర్పడటానికి అప్పటి బీఆర్ఎస్ (BRS) పాలకుల విధానాలే కారణమని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) మండిపడ్డారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ (KCR)కి దక్కిందని విమర్శించారు.. నేడు ఖమ్మం (Khammam) జిల్లా వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో ఎంతటి పెద్దవారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు.. చట్టం ఎవరికీ చుట్టం కాదని తెలిపిన ఆయన.. తప్పు చేసిన వారు ఊచలు లెక్కపెట్టడం ఖాయమని పేర్కొన్నారు.. కోట్ల రూపాయలు విద్యుత్తు కొనుగోలులో కొల్లగొట్టారని ఆరోపించారు. అంతేకాకుండా ధరణి పోర్టల్ ద్వారా వేల ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పొంగులేటి ఆరోపించారు..
మరోవైపు రెండుసార్లు దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా.. వదిలేసిన మహానేత రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు.. ఇందిరమ్మ రాజ్యంలో పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలిపారు.. అదేవిధంగా ఖమ్మం పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదని వెల్లడించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. వారిని గెలిపించవలసిన బాధ్యత అందరిదని సూచించారు..
మరోవైపు బీజేపీ (BJP)పై విమర్శలు గుప్పించారు.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తుందని ఆరోపించారు.. బీజేపీ.. బీఆర్ఎస్ పేదల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని మంత్రి విమర్శలు చేశారు..