రాష్ట్రంలో నిజమైన మార్పు రావాలంటే కుటుంబ పార్టీలకు చరమగీతం పాడాలన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy). సంగారెడ్డి(Sangareddy)లో ఏర్పాటు చేసిన బీజేపీ(BJP) విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై విమర్శల వర్షం గుప్పించారు. సీఆర్ కుటుంబం తెలంగాణను దోపిడీ చేసిందన్న ఆయన కాంగ్రెస్ నేతలు రాహుల్ ట్యాక్స్ పేరుతో వసూళ్లు చేపట్టారని ఆరోపించారు.
బీజేపీ మాత్రం ప్రజల కోసం పని చేసే పార్టీ అని, హ్యాట్రిక్ ప్రధానిగా మోదీ రాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ అధికారంలో ఉండి ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు కిషన్‌రెడ్డి.రాష్ట్రంలో కేంద్రం రూ.10లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందని, అయినా తెలంగాణలో కొందరు నాయకులు బీజేపీ ఏం చేయలేదని విమర్శిస్తున్నారని అన్నారు. కొత్త రైలు మార్గాలు, విద్యుద్దీకరణ, రైల్వేస్టేషన్ల ఆధునీకరణ జరిగిందని వివరించారు.
రాష్ట్రంలో 40 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులు కేంద్రం చేపట్టిందన్నారు. ఇప్పటికే 3 వందే భారత్ రైళ్లు, ఎన్టీపీసీ థర్మల్ ప్లాంటు మంజూరు చేశామని కిషన్‌రెడ్డి చెప్పారు. ఆర్ఆర్ఆర్ చుట్టూ ఔటర్ రింగ్ రైలు కోసం సర్వే జరుగుతోందని తెలిపారు. తెలంగాణకు కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని వివరించారు. బీజేపీ వచ్చిన పదేళ్లలో రాష్ట్రంలో జాతీయ రహదారులు రెండు రెట్లు పెరిగాయని తెలిపారు. 2500కి.మీ మేర జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని తెలిపారు.
అదేవిధంగా బీజేపీ నేత ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్దితోనే దేశం అభివృద్ధి చెందుతుందనే విధానాన్ని మోడీ అనుసరిస్తున్నారని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ భూసంస్కరణకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మోదీని రాష్ట్రానికి పెద్దన్న పాత్ర పోషించాలని కోరడం సంతోషకరమన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి జరగాలంటే మోడీ మళ్లీ ప్రధాని కావాలని, దానికి తెలంగాణ ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని కోరారు.