కర్ణాటక(Karnataka)లో కాంగ్రెస్ పార్టీ(Congress Party) ని గెలిపించిన ప్రజలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారని బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆరోపించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. పార్టీలో చర్చించి బీజేపీ పక్షనేతను నిర్ణయిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఫైళ్లు మాయమవడంపై ప్రభుత్వం వెంటనే సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఫైళ్లు మాయం చేసిన వారిపై ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. మూడు రోజులుగా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంటి పై ఐటీ అధికారుల దాడులు జరుగుతున్నాయని, దేశమంతా విస్తుపోయేలా రూ.290 కోట్లు దొరికాయన్నారు. ఇంత డబ్బు గతంలో ఎప్పుడూ పట్టుబడలేదన్నారు. ఆ ఎంపీ ఎలక్షన్ కమిషన్కు చూపించిన ఆస్తి చాలా తక్కువ అని, ఇక్కడ లెక్కబెట్టలేని సంపద దొరకడం చూస్తుంటే ఎంత అవినీతి చేస్తున్నారో స్పష్టమవుతోందన్నారు.
అతడి వద్ద ఉన్న దస్తావేజులు అక్కడ ఉన్న దన్నుకు పొంతన లేకుండా ఉందని తెలిపారు. అతడి అక్రమ సంపాదనకు సంబంధించిన వివరాలు ఉన్న కంప్యూటర్స్ అల్మారాలో గుర్తించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్న ధీరజ్ సాహు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న చిన్న విషయాలకు స్పందిస్తూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టే రాహుల్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
లోక్ సభ ఎన్నికల్లో మూడు సార్లు ఓడిపోయినా కూడా ధీరజ్ సాహును మూడు సార్లు రాజ్యసభ ఎన్నుకున్నారని కిషన్రెడ్డి విమర్శించారు. ధీరజ్ సాహుపై రాహుల్కు ఎందుకింత ప్రేమని ప్రశ్నించారు. గతంలోనూ అవినీతికి పాల్పడి కాంగ్రెస్ పార్టీ మంత్రులుగా ఉన్న వ్యక్తులే తీహార్ జైల్లో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసే ముఖ్య మంత్రులను, ఎంపీలను ఏటీఎంలుగా మార్చుకుందని ఎద్దేవా చేశారు.
కర్ణాటకలో ఆరు నెలలు పూర్తి కాక ముందే కాంగ్రెస్ దోపిడీ కి పాల్పడుతోందని కిషన్ రెడ్డి తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ దోపిడీకి భయపడి అక్కడ బిల్డర్స్ పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ అవినీతిని కట్టడి చేసేందుకు డిజిటల్ ట్రాన్సాక్షన్ తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు బుద్ది చెబుతారని అన్నారు.