– సనాతన ధర్మాన్ని అవమానిస్తోంది
– హిందూత్వాన్ని ప్రశ్నిస్తోంది
– దేశ సమైక్యతను అస్తిరపరుస్తోంది
– విద్వేషాలను రెచ్చగొడుతోంది
– ‘ఇండియా’ కూటమి వల్ల నో యూజ్
– అహంకార కూటమి నేతలకు బుద్ధి చెప్పాలి
– దేశ ప్రజలకు కిషన్ రెడ్డి పిలుపు
కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని ఇండియా కూటమిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఫైర్ అయ్యారు. సనాతన ధర్మానికి, హిందుత్వం, హిందీ మాట్లాడే ప్రజలకు ఇండియా కూటమి రోజు రోజుకూ ప్రమాదంగా మారుతోందని ఆ విషయాన్ని గమనించాలని బహిరంగ ప్రకటనలో వెల్లడించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండి కూటమి’ అహంకారాన్ని ఆదిలోనే అడ్డుకుని, సరైన బుద్ధి చెప్పాలని పిలునిచ్చారు.
అంతకుముందు ఇండియా కూటమి నేత హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచేలా తీవ్ర వ్యాఖ్యలు చేశాడన్నారు. సనాతన ధర్మాన్ని క్యాన్సర్, డెంగ్యూ, మలేరియాతో డీఎంకే నేతలు పోల్చారని ఫైర్ అయ్యారు. కొంతమంది కొంత మంది కుహనా లౌకికవాదులు అహంకారపూరితంగా నోటికొచ్చినట్లు మాట్లాడటమే తమ మేధావితనంగా, గొప్పతనంగా భావిస్తారని అన్నారు. ప్రతిసారీ హిందుత్వం పై తమ అక్కసును వెల్లగక్కడం ద్వారా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తమ ఎజెండాను స్పష్టం చేస్తోందని ధ్వజమెత్తారు.
అధికారంలోకి వస్తే హిందుత్వాన్ని, హిందువులను నిర్మూలించడమే తమ లక్ష్యమని ఆ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఇలా మాట్లాడితే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయేమోనని కూడా కాంగ్రెస్ ఆలోచించడం లేదన్నారు. ఇండియా కూటమి మొదటి నుంచి అవకాశం దొరికినపుడల్లా దేశ సమైక్యతను అస్తిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. దేశ సమగ్రత పట్ల తనకున్న విద్వేషాన్ని ఇండియా కూటమి మరోసారి బయట పెట్టుకుందన్నారు. యూపీ, బిహార్ నుంచి వచ్చే హిందీ మాట్లాడే ప్రజలు తమిళనాడుకు టాయిలెట్లు కడిగేందుకు వస్తారని డీఎంకే నేత చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరం, ఆక్షేపణీయమన్నారు.
ఆయా ప్రాంతాలకు చెందిన కార్మికులు జీవనోపాధి కోసం దేశంలోని పలు ప్రాంతాలకు వలస వెళ్తారని, అంత మాత్రాన వారిని ఇంత నీచంగా అవమానించాల్సిన అవసరం ఉందా? అని నిప్పులు చెరిగారు. శ్రమజీవులను అవమానించడం, కష్టపడి పనిచేసేవారికి అవహేళన చేయడం కాంగ్రెస్ , వారితో అంటకాగుతున్న వారికి మొదటి నుంచి అలవాటేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా రాజకీయ స్వార్థంతో కడుపు నిండా ద్వేషాన్ని నింపుకుని కూటమి నేతలు మాట్లాడారన్నారు. గో మూత్రాన్ని తాగే రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తుందన్న ఆ ఎంపీ చేసిన అహంకార పూరితమైన వ్యాఖ్యలను యావత్ భారత్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ కూడా యూదులపై ఇలాంటి భాషలోనే తీవ్రంగా దూషించేవాడన్నారు. ‘మీదొక మతం కాదు.. సమాజానికి పట్టిన క్షయ వ్యాధి’అని యూదులను దూషించారన్నారు. చివరకు దీని ద్వారా హిట్లర్ సాధించిందేమీ లేదన్నారు.
హిందూ సమాజం, భారత్ కాంగ్రెస్ నుంచి మరిన్ని ఇలాంటి వ్యాఖ్యలు వినాల్సి వస్తుందేమోనన్నారు. జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవం నాటికి దేశ ప్రజల నైతికతను దెబ్బతీసేలా ఇంకా ఎన్ని ప్రకటలు చేస్తారోననే ఆందోళన దేశ ప్రజలను కలవరపరుస్తోందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచీ కాంగ్రెస్ ఇదే ధోరణితో ముందుకెళ్తోందన్నారు. 1947 నవంబర్‌లో సోమనాథ్ ఆలయాన్ని పునరుద్ధరిద్దామని . నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పారని, దానికి గాంధీ కూడా అంగీకరించారన్నారు. కానీ నాటి ప్రధాని నెహ్రూ దాన్ని వ్యూహాత్మకంగా అడ్డుకున్నారని అన్నారు.
కాంగ్రెస్ మిత్రపక్షమైన డీఎంకే సనాతనధర్మాన్ని, శ్రీరాముడి అస్తిత్వాన్ని ప్రశ్నించిందన్నారు. గతంలో ఆ మేరకు ఎన్నో ప్రదర్శనలు చేసిందన్నారు. 1971, జనవరి 24న సేలంలో కాంగ్రెస్ కూటమిలోని డీఎంకే పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించిందన్నారు. రాముడి దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టి దగ్ధం చేసిందని గుర్తు చేశారు. పవిత్రమైన రామసేతును కూల్చి, సేతు సముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్టును నిర్మించాలనుకుంటున్నట్లు 2007లో సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో చెప్పిందన్నారు. పురాణాలు, ఇతిహాసాల్లో పేర్కొన్న అంశాలన్నీ ప్రాచీన భారతీయ సాహిత్యసృష్టి అని,వీటికి చారిత్రక ఆధారాలేమీ లేవని పేర్కొన్నారు.
మరోవైపు డీఎంకే ఓ అడుగు ముందుకేసి రామునిపై అనుచిత వ్యాఖ్యలు చేసిందన్నారు. ‘రాముడెవరు? ఆయన ఏ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చదివాడు? ఈ బ్రిడ్జ్‌ను ఎప్పుడు కట్టాడు?దీనికేమైనా ఆధారాలున్నాయా?’ అని కించపరిచిందన్నారు. కాంగ్రెస్, వారి కూటమిలోని పార్టీల అజెండా చాలా స్పష్టంగా కనబడుతోందన్నారు. కాంగ్రెస్ ఆలోచన, ముందుకు సాగుతున్న తీరు దేశ అంతర్గత భద్రతను ప్రశ్నించేదిగా ఉందన్నారు. మెజారిటీ ప్రజల విశ్వాసాన్ని, అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని గమనించి దీన్ని ప్రతి భారతీయుడు ఖండించాలని అన్ని వర్గాల ప్రజలను ఆయన కోరారు.