సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ (BJP) చీఫ్ కిషన్ రెడ్డి (Kishan Reddy) లేఖ రాశారు. రాష్ట్రంలో భారత్ మాల ప్రాజెక్టు, రింగు రోడ్డుకు సంబంధించి ఈ లేఖ రాశారు. భారత్ మాల కింద నిర్మించబోయే రోడ్ల కోసం భూ సేకరణ చేపట్టాలని సీఎంను లేఖలో ఆయన కోరారు. దీంతో పాటు ఆర్ఆర్ భూసేకరణ కోసం 50 శాతం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ విషయానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ సర్కార్ కు లేఖలు రాశామని అన్నారు. కానీ అప్పటి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని వెల్లడించారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను ఆలస్యం కాకుండా చూసుకోవాలని, వాటిని త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన సమయం నుంచి లక్ష కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి రాష్ట్రంలో జాతీయ రహదారులను కేంద్రం నిర్మించిందని అన్నారు. ఆయా ప్రాంతాల్లో సామాజిక, పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి ఈ జాతీయ రహదారులు సహాయపడ్డాయన్నారు. దీంతో పాటు చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తీరాయన్నారు.
ప్రస్తుతం మరిన్ని జాతీయ రహదారులను కేంద్రం నిర్మిస్తోందన్నారు. వాటికి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తే రోడ్ల నిర్మాణ విషయంలో కేంద్రానికి వీలుగా ఉంటుందన్నారు. దీంతో రాష్ట్రం అభివృద్ధి దిశలో మరింత ముందుకు వెళ్తుతుందన్నారు. ఇది ఇలా వుంటే సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా లేఖ రాశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు అవుతున్నా సర్పంచ్ల బిల్లులపై దృష్టి సారించలేదని తెలిపారు. అధికారంలోకి రాగానే సర్పంచ్ల సమస్యలు తీరుస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. అందువల్ల రాష్ట్రంలో సర్పంచ్ల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.