కేసీఆర్ (KCR) సర్కార్ నరకకూపంగా మారిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy). కాచిగూడ-యశ్వంతాపూర్(బెంగళూరు)కు వందేభారత్ రైలును ప్రధాని మోడీ (PM Modi) వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కాచిగూడ (Kachiguda) రైల్వే స్టేషన్ లో జరిగిన కార్యక్రమానికి కిషన్ రెడ్డి హాజరయ్యారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిదిన్నరేండ్లలో ఏటా 55 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం చేపట్టారని చెప్పారు.
అన్ని రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ (Telangana) లో రైల్వే నెట్ వర్క్ తక్కువగా ఉందని, ఆ విషయం గ్రహించే ప్రధాని మోడీ అధిక రైల్వే ప్రాజెక్టులు ఇస్తున్నారని తెలిపారు కిషన్ రెడ్డి. రీజనల్ రింగ్ రోడ్డు కోసం రూ.20 వేల కోట్లు కేటాయించించారని.. దానిచుట్టూ రైల్వే లైన్ నిర్మాణానికి, రైల్ రింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఓకే చెప్పిందన్నారు. నగరం అనేక రంగాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని, రవాణా రంగం అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
ఇప్పటి వరకు తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలను కేటాయించిందని వివరించారు కిషన్ రెడ్డి. ఇక ప్రధాని మోడీ అక్టోబర్ 1, 3వ తేదీల్లో తెలంగాణకు రాబోతున్నారని, అనేక రైల్వే ప్రాజెక్టులకు ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నారని తెలిపారు. వినాయక చవితి సందర్భంగా కేంద్రం తెలంగాణకు మూడో వందేభారత్ రైలును కానుకగా అందించిందన్నారు.
మరోవైపు, గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై స్పందించిన కిషన్ రెడ్డి.. కేసీఆర్ సర్కార్ పై మండిపడ్డారు. అప్పులు చేసి నిరుద్యోగులు కోచింగ్ తీసుకున్నారని తెలిపారు. తొలిసారి గ్రూప్-1 పరీక్ష పేపర్ లీకై అభ్యర్థులు ఆగమయ్యారని.. ఇప్పుడు మరోసారి పరీక్ష రద్దయిందని.. దీనికి సీఎం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ తీరుతో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. అభ్యర్థుల జీవితాలతో సర్కార్ చెలగాటం ఆడుతోందని దుయ్యబట్టారు. పరీక్షలు నిర్వహించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు కిషన్ రెడ్డి.