చేవెళ్ల సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అబద్దాలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య డీల్ ఉందని.. ఈ డీల్‌కు మజ్లిస్ మధ్యవర్తిత్వం వహిస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్కు ఓటేసినట్లే అనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా తెగిస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌కు బీజేపీతో అంతర్గత స్నేహం కుదిరిందని.. అందుకే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మానేశారన్న ఖర్గే వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య దోస్తీ లేదనే విషయాన్ని నిరూపించాలనుకుంటే.. తన ప్రశ్నలకు ఖర్గే సమాధానం చెప్పాలన్నారు.
తెలంగాణలో చేతి గుర్తుమీద గెలిచిన చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద మీ ఎమ్మెల్యేల మీద మీరు చర్యలు తీసుకోకపోవడం మీ రెండు పార్టీల మధ్య ఉన్న సత్సంబంధాలకు నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్‌కు హైదరాబాద్ నడిబొడ్డున ఎకరం భూమి కేవలం ₹2 లక్షల చొప్పున 10 ఎకరాల విలువైన భూమిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టబెట్టింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలపడంతోపాటుగా.. ఆ ఎన్నికల ప్రచారాన్ని తెలంగాణలో కేసీఆర్ ముందుండి నడపడం మీ మధ్య ఉన్న దోస్తీకి చిన్న ఉదాహరణ కాదా? అంటూ నిలదీశారు.
శాసనమండలిలో కాంగ్రెస్ను పూర్తిగా బీఆర్ఎస్ లో విలీనం చేసేసినపుడు దీనిమీద స్పందించకపోవడం మీ మద్య దోస్తీకి పరాకాష్ట కాదా? ఈ విలీనంతో మీరిద్దరూ సంతోషంగా ఉన్నారనేది నిజం కాదా?. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మజ్లిస్ సయోధ్య కుదుర్చుతోంది. అందుకే మీరంతా కలిసి ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్నది నిజం కాదా? బీఆర్ఎస్ మద్దతులేకుండా UCCని వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పగలదా?. మొన్నటి లోక్‌సభ సమావేశాలలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కలిసి అనుకూలంగా ఓటు వేసిన విషయం వాస్తవం కాదా? అనిప్రశ్నించారు.