బీజేపీ (BJP) రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన విజయ సంకల్ప యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. కాగా ఈ యాత్రలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy), బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ (KCR) కుటుంబ పాలన ఖతమైందని పేర్కొన్నారు. కేసీఆర్ పాపాల ఫలితంగానే బీఆర్ఎస్ (BRS) ఓడిపోయిందని విమర్శించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటేస్తే వృథా అవుతుందన్నారు. ఒక్క ఎంపీ సీటు గెలిచినా.. తెలంగాణకు లాభం లేదని.. గెలవకున్నా నష్టం లేదని పేర్కొన్నారు. ఇక మోసపూరిత కాంగ్రెస్ (Congress)ను సైతం నమ్మొద్దని తెలిపారు.. విజయ సంకల్ప యాత్రలో భాగంగా కాగజ్ నగర్ లో పర్యటిస్తున్న కిషన్ రెడ్డి.. రామగుండంలో ఎరువుల పరిశ్రమను మోడీ (Modi) ప్రారంభించారని గుర్తు చేశారు.
ఈ పదేళ్ళ పాలనలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ.. ఆదివాసీ ప్రాంతాలను వెనుకబడిన ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి జన్ మన్ యోజన పథకానికి ప్రధాని శ్రీకారం చుట్టారని కిషన్ రెడ్డి తెలిపారు. రానున్న 5 ఏళ్ళ పాటు మహిళ సంక్షేమం కోసం వారి హక్కుల కోసం సాధికతర కోసం కూడా కేంద్రం పని చేస్తుందన్నారు. త్రిపుల్ తలాక్ రద్దు చేశామని, మహిళ రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చామని వివరించారు.
రైతుల అభివృద్దిపై కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని తెలిపిన కిషన్ రెడ్డి.. స్టాండ్ప్, స్టాటప్ ద్వారా యువతకు కేంద్రం ప్రోత్సాహమిస్తుందన్నారు. యువత శక్తియుక్తులను దేశానికి అవసరమైన విధంగా వాడుకునేలా కృషి చేస్తున్నామన్నారు. అన్ని వర్గాలలో ఉన్న పేదలను, బీసీ, ఎస్సీ, వివిధ వర్గాలలో ఉన్న పేదల గుర్తించి అభివృద్ది చేస్తామని క్లారిటీ ఇచ్చారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన బడ్జెట్ ను 6 రెట్లు పెంచడమే కాకుండా.. ఎరువులు కొరత, విద్యుత్ కోతలు లేని విధంగా దేశాన్నితీర్చిదిద్దామన్నారు.
ప్రపంచమంతా ఎరువులు ధరలు పెరిగిన మన దేశంలో మాత్రం ఎరువుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది రెండు సార్లు రైతుల అకౌంట్ లలో కిసాన్ సమ్మాన్ నిధులు వేయడం జరుగుతుందన్నారు. కేంద్రం 9 ఏళ్ళలలో వరి కొనడానికి రూ.27 వేల కోట్లు ఖర్చు తెలంగాణలో పెట్టిందన్నారు. గత ముఖ్యమంత్రి పసల్ భీమా అమలు కాకుండా చేశాడన్నారు. రైతుల భూముల వివరాలు కేంద్రానికి ఇవ్వలేదని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
అందుకే దేశంలోని ప్రజలందరూ మళ్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలని కోరుకుంటున్నారని.. దేశం అభివృద్ధి చెందాలని భద్రత ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. అంతేగాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు కూడా మళ్లీ మోడీ ప్రధాని కావాలనుకొంటున్నట్లు వెల్లడించారు. పనిచేసే ప్రభుత్వంతో దేశం కానీ, రాష్ట్రం కానీ అభివృద్ధి జరుగుతుందని.. ఆ లక్షణాలున్న నాయకుడు మోడీ అని కొనియాడారు.