TS: బీజేపీ తెలంగాణ(Bjp Telangana) అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishanreddy) ఢిల్లీ చేరుకున్నారు. ఇందులో భాగంగా రేపు జరగబోయే బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం(BJP Central Election Committee meeting)లో పాల్గొననున్నారు. తెలంగాణ అభ్యర్థుల జాబితాపై రేపటి సమావేశంలో చర్చించనున్నారు. తెలంగాణ బీజేపీ అభ్యర్థులపై ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జరిగిన అంశాలను కూడా కేంద్రంలోని నాయకులకు తెలపనున్నారు.
రేపు రాత్రికి బీజేపీ తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. తొలిజాబితాలో బీజేపీ 40 మంది అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల కమిటీ అభ్యర్థుల ఖరారుపై తుది కసరత్తు పూర్తి చేసింది. ఇందులో బీసీలు, మహిళలకు ప్రధాన్యత ఇచ్చినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.
బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే సీఎం చేస్తామని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై పోటీకి విజయశాంతి సన్నద్ధమవుతున్నారు. అదేవిధంగా కేసీఆర్ పోటీ చేస్తోన్న మరో నియోజకవర్గం గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ పోటీ రెడీ అయ్యారు. అంబర్‌పేట్ నుంచి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కరీంనగర్ అసెంబ్లీ బరిలో బండి సంజయ్, ఎల్‌బీ నగర్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పోటీకి దిగనున్నారు. మునుగోడులో రాజగోపాల్ సతీమణి లక్ష్మి పోటీకి సై అంటున్నారు. ఎంపీ లక్ష్మణ్ ఈ సారి పోటీకి దూరంగా ఉన్నారు.
ఢిల్లీలో నిర్వహించనున్న బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో హైకమాండ్ అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సుమారుగా 60శాతం అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ బీజేపీ నేతల్లో ఏకాభిప్రాయం వచ్చినట్లు సమాచారం. అందులో రేపు 40మంది అభ్యర్థుల పేర్లు వెల్లడి కానున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని బీసీలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు స్పష్టమవుతోంది.