లోక్సభ ఎన్నికల్లో(Loksabha Elections) తెలంగాణ(Telangana)లో 10స్థానాలకు పైగా గెలుస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి(Kishan Reddy) అన్నారు. బీజేపీ(BJP) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్(Hyderabad)లోని కార్యాలయంలో జెండా ఎగురవేశారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ విశ్వ నాయకుడిగా గుర్తింపు పొందారని, ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని తెలిపారు. దేశ వ్యాప్తంగా బీజేపీ 400సీట్లతో కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ రోజురోజుకు కనుమరుగవుతోందని, కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో హామీలను గాలికి వదిలేసిందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందన్నారు.
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన రాహుల్ గాంధీ ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారని మండిపడ్డారు. హామీలు అమలు చేయలేదు కానీ.. పెద్ద పెద్ద ప్రకటనలు, సభలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ పథకాల అమలుపై లేదని దుయ్యబట్టారు. ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
పార్లమెంట్ ఎన్నికల కోసం మేనిఫెస్టోను ప్రకటించడం కాదని.. ముందు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రజల దృష్టి ఇప్పుడు బీజేపీపై ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకే ఓటేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మెజార్టీ సీట్లు గెలుచుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.