తెలంగాణ (Telangana)లో ఎన్నికలకు సమయం ఎక్కువగా లేకపోవడంతో ప్రచారంలో నేతలు దూకుడు పెంచారు. ప్రధాన పార్టీలన్నీ విమర్శలనే ముఖ్య ఆయుధాలుగా మలచుకుని వీలైనన్ని ఓట్లు రాబట్టుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ (Congress) మాటల్లో వేగం.. విమర్శలలో డోస్ పెంచి ప్రచారాలు నిర్వహిస్తుంది. హస్తం పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తేవడానికి ప్రియాంకా గాంధీ, బీఆర్ఎస్ (BRS) టార్గెట్ గా ప్రచారంలో దూసుకుపోతున్నట్టు తెలుస్తుంది.
గద్వాలలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రియాంకగాంధీ (Priyanka-Gandhi) బీఆర్ఎస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. యువకుల త్యాగాలు, బలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని.. ఈ రాష్ట్రం పురోగతి చెందాలంటే మీ ఓటు విలువైనది అంటూ ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. త్యాగం చేసిన వాళ్లు ఒకవైపు, దోపిడి చేసిన వాళ్లు మరోవైపు ఉన్నారని వెల్లడించారు. అమరుల ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయనేది ఆలోచించి ఓటు వేయాలని ప్రియాంకగాంధీ తెలిపారు.
పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఏం అభివృద్ధి చేసిందో ఒక్కసారి ఆలోచించాలని ప్రియాంక గాంధీ అన్నారు. కలలు కన్న తెలంగాణ సాకారం కాలేదు.. ప్రత్యేక రాష్ట్రం వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని నమ్మారు..కానీ కేసీఆర్ (KCR) అన్ని వర్గాలను మోసం చేశారని ప్రియాంక మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రంలో పేదలే ఎక్కువగా నష్ట పోతున్నారని ఆరోపించిన ప్రియాంకగాంధీ.. పదేళల్లో కేసీఆర్ కుటుంబం ఆస్తులు ఎంతగా పెరిగాయో ప్రజలు గమనించాలని పేర్కొన్నారు..
మరోవైపు దేశ సంపదను మోడీ.. అదానీకి పంచుతున్నారు.. కేసీఆర్ తన కుంటుంబం బాగుకోసం దాచుకుంటున్నారు.. ఇద్దరు ఇద్దరే అని వెల్లడించిన ప్రియాంక.. కేసీఆర్ ను గద్దె దించేందుకు ఇదే మంచి సమయమని గుర్తుచేశారు. ఇప్పటికీ బీఆర్ఎస్ కుంటుంబ నేతలు ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణలో అన్ని వర్గాలకు మేలు జరుగు తుందని నమ్మితే మోసం చేశారని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. పేదల జేబులు కొట్టి పెద్దలకు పంచడమేనా? కబ్జాలు చేసి జనాన్ని ఇబ్బంది పెట్టడమేనా? పాలన అంటే అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు..