నూతనంగా నియమితులైన ఎమ్మెల్సీలు కోదండరాం (Kodandaram), అమీర్ అలీఖాన్ (Amer Ali Khan)లకు నిరాశ ఎదురైంది. ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసేందుకు ఇద్దరు ఎమ్మెల్సీలు సోమవారం కౌన్సిల్ హాల్ కు వెళ్లారు. కానీ ఆ సమయంలో మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి ఆ సమయంలో అక్కడ లేకపోవడంతో ఇదర్దు ఎమ్మెల్సీలు చాలా సేపు ఎదురు చూశారు.
కానీ చైర్మన్ రాకపోవడంతో ఇద్దరు ఎమ్మెల్సీలు అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. ఉదయం 11 గంటల నుంచి ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌తో కలిసి తాను శాసన మండలిలో వేచి ఉన్నామని తెలిపారు. చైర్మన్‌కు తాము సమాచారం ఇవ్వకుండానే మండలికి వచ్చామని వెల్లడించారు.
అయితే మండలి చైర్మన్ అనారోగ్యంతో బాధపడుతున్నారని మండలి సిబ్బంది చెప్పారని వివరించారు. ఛైర్మన్ తమకు ఫోన్‌లో టచ్‌లోకి రాలేదని చెప్పారు. దీంతో ప్రమాణ స్వీకార విషయాన్ని మండలి ఛైర్మన్‌కు తెలియజేయాలని సెక్రటరిని కోరామని వివరించారు. జనవరి 30 ఉదయం 09:30 గంటలకు ప్రమాణ స్వీకారానికి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు.
తనను ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేయడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కోదండరాం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాము చేసిన సేవల గురించి తెలంగాణ సమాజానికి తెలుసని ఆయన పేర్కొన్నారు. తన ఎంపికపై అనవసరంగా వివాదం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అది సరికాదని తెలిపారు.