అందరూ కలిసి పోరాడి ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని తెలంగాణ జనసమితి వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కోదండ రాం అన్నారు. కానీ తన ఒక్కడి పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారుడు ఖరీం ఆత్మ బలిదానం చేసిన తర్వాతే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారన్నారు.
తెలంగాణ ఉద్యమకారులారా కలిసి మాట్లాడుకుందాం రండి రౌండ్ టేబుల్ సమావేశాన్ని కామారెడ్డిలో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… ఎన్నో ఉద్యమాలకు కామారెడ్డి గడ్డ ఊపిరి పోసిందన్నారు. కామారెడ్డిలో ప్రజలు, ఉద్యమకారులంతా ఏకమై సీఎం కేసీఆర్ ను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రజలకు కనీసం రక్షణ కల్పించలేని స్థితిలో నేడు కేసీఆర్ సర్కార్ ఉందన్నారు. కేసిఆర్‌తో కుమ్మకై ప్రజలను బీజేపీ మోసం చేస్తోందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్ర ఏర్పాటును ప్రజలు కోరుకున్నారన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణలో కాంట్రాక్ట్ కమీషన్ల కోసం, దుర్మార్గపు పాలనను సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారంటూ మండిపడ్డారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం పేదల విముక్తి కోసం ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమస్యలను పరిష్కరించాలని అడిగితే కేసులతో భయందోళనలకు గురి చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాల ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
మనం పోరాడితేనే తెలంగాణ వచ్చిందన్నారు. ఇప్పుడు అ తెలంగాణలో కేసీఆర్ గద్దెనెక్కి కూర్చున్నాడన్నారు. మళ్లీ మనమంత పోరాటం చేసి కేసీఆర్ ను గద్దె దించాలన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి షబ్బీర్ అలీ అని అన్నారు. ఇప్పుడు అలాంటి వ్యక్తిని కేసీఆర్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. సమస్యల ప్రతిపాదికన మనమంతా ఏకమై పోరాడాలన్నారు.