తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections) గురువారం(నవంబరు 30)న జరగనున్నాయి. సమయం ఎక్కువగా లేకపోవడంతో ప్రధాన పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్(Brs), కాంగ్రెస్ (Congress)నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంటోంది.
తాజాగా, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్(Kodangal)అసెంబ్లీ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కొడంగల్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు నమోదైంది. కోస్గి పట్టణంలో శనివారం రాత్రి తమపై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగినట్లు కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూర నరేష్ కోస్గి పోలీసులను ఆశ్రయించాడు. కాంగ్రెస్ పార్టీని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావంటూ తనను దూషిస్తూ కర్రలతో చితకబాదారని, రాళ్లతో కొట్టారని బాధితుడు పోలీసుల ముందు వాపోయాడు. దీంతో పోలీసులు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు ఆయన కొడుకు హితేష్ రెడ్డి, మరో ఎనిమిది మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇందులో ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని A1 నిందితుడిగా పోలీసులు చేర్చారు.
అదేవిధంగా మరో ఘటన కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్‌పేటలో చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ బోరబండ కార్పొరేటర్ ఫసియుద్దీన్‌కు కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో రెండుకార్లు ధ్వంసమయ్యాయి. తనపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడినట్లుగా కార్పొరేటర్ ఫసియుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రేవంత్ ఇదివరకు 2009, 2014 ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రాతినిథ్యం వహించారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వ్యూహాలకు పదునుపెట్టినట్లు తెలుస్తోంది.