షహీద్ హోన్యా కెంగ్లీ (Honya Kengle)… బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన గొప్ప గిరిజన పోరాట యోధుడు. కోలి తెగ యువకులతో సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటీష్ (British) సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టిన విప్లవ నాయకుడు. పూణె, నాసిక్, థానా, అహ్మద్ నగర్ ప్రాంతాల్లో తన మెరుపు దాడులతో బ్రిటీష్ వాళ్లను ముప్పుతిప్పలు పెట్టిన వీరుడు.
1836లో మహారాష్ట్రలో పూణె జిల్లా జంబోరి గ్రామంలో కోలి తెగలో జన్మించారు. తండ్రి బాగోజీ కెంగ్లీ. మహదేవ్ కోలి తెగకు బాగోజీ కెంగ్లీ నాయకుడు. 1872 ప్రాంతంలో దక్కన్ ప్రాంతంలో కరువు సంభవించింది. ఆ సమయంలో బ్రిటీష్ అధికారుల సహాయంతో వడ్డీ వ్యాపారస్తులు ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారు.
పంటలు సరిగా పండకపోయినప్పటికీ ప్రజల నుంచి వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలను ముక్కు పిండి వసూలు చేశారు. ప్రశ్నించిన వారిని బ్రిటీష్ అధికారులు తీవ్రంగా హింసించే వారు. ఈ క్రమంలో బ్రిటీష్ వారికి ఎదురి తిరిగాడు. స్థానిక కెంగ్లీ యువకులతో కలిసి సాయుధ దళాన్ని ఏర్పాటు చేశాడు. పూణె, నాసిక్, థానే, అహ్మద్ నగర్ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారుల ఇండ్లపై దాడులు చేసి దోచుకున్నాడు.
బ్రిటీష్ అధికారులకు సహాయం చేసే వాళ్ల ముక్కులు కోశాడు. దీంతో హోన్యా కెంగ్లీని పట్టించిన వారికి రూ. 1000 నగదు బహుమతి ఇస్తామని బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆ తర్వాత ఈ తిరుగుబాటును అణచి వేసేందుకు కల్నల్ స్కాట్, డబ్ల్యూ ఎఫ్ సింక్లెయిర్ సీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక దళాన్ని బ్రిటీష్ ప్రభుత్వం పంపించింది.
1876లో బ్రిటీష్ దళాల చేతిలో కోలీ సేనలు ఓడిపోయాయి. హోన్యా కెంగ్లేను మేజర్ హెచ్. డేనియల్ బంధించారు. హోన్యాను కోర్టులో ప్రవేశ పెట్టగా… విచారణ అనంతరం ఆయన్ని నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. ఆ తర్వాత ఇదే కేసుపై బాంబే కోర్టులో మరోసారి విచారణ జరగ్గా…. ఆయన్ని కోర్టు దోషిగా నిర్దారించింది. అహ్మద్ నగర్ సెంట్రల్ జైలులో ఆయన్ని ఉరితీశారు.