తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా కొల్లాపూర్ (Kollapur) నియోజకవర్గం ప్రత్యేకంగా నిలిచింది. ఇక్కడి రాజకీయం జనంలో ఆసక్తిని పుట్టిస్తుంది. దీనికి కారణం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన బర్రెలక్క.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగటం మింగుడు పడని కొందరు ఆమె తమ్ముడిపై దాడి చేయటం సంచలనంగా మారింది.
రెండు రోజుల క్రితం పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బర్రెలక్కతో పాటు ఆమె తమ్ముడిపై కూడా దాడి చేశారు. ఆమె తమ్ముడిని తీవ్రంగా గాయపరిచారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా రాష్ట్రం అంతా చుట్టేసింది. ఈ నేపథ్యంలో తనకు 2 + 2 గన్ మెన్లతో భద్రత కల్పించాలని బర్రెలక్క (Barrelakka) తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది.
పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు (High Court)..ఎన్నికలు పూర్తయ్యే వరకు బర్రెలక్క అలియాస్ శిరీష కుటుంబం మొత్తానికి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. మరోవైపు ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లింది. బర్రెలక్క ప్రచారం చేసే సమయంలో సెక్యూరిటీ ఇచ్చి ఊరుకోకుండా.. ఎన్నికలు పూర్తయ్యే వరకు అభ్యర్థి భద్రత పోలీస్ శాఖ బాధ్యత అని హైకోర్టు వ్యాఖ్యానించింది..
మరోవైపు తాను ఓట్లు చీల్చుతాననే భయంతో కొందరు దాడులకు ప్రయత్నిస్తున్నారని శిరీష తెలిపింది. తమపై దాడికి పాల్పడింది ఎవరో.. వారు ఏ పార్టీ వారో కూడా తెలుసని కానీ వారి పార్టీ పేరు వెల్లడించనని బర్రెలక్క స్పష్టం చేసింది. ప్రజాసామ్యంలో ఎవరైనా పోటీ చేసే హక్కు ఉందని తెలిపింది. రాజకీయంగా ఎదుర్కోవాలే కానీ భౌతికంగా దాడులకు పాల్పడటం పిరికి చర్యగా శిరీష ఆరోపించింది..