నల్గొండ (Nalgonda) జిల్లా రాజకీయాలు ప్రతి ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారుతాయి. ఇదివరకు బీఆర్ఎస్, బీజేపీ (BJP)..కాంగ్రెస్ (Congress) మధ్య ఇక్కడ పోటీ హాలీవుడ్ సీన్స్ రేంజ్ లో ఉంటాయని అంతా భావించారు. కానీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కాషాయాన్ని వీడి హస్తం గూటికి చేరడంతో ప్రస్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు ఏ స్థాయిలో ఉంటుందో అని చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలో నేతల మధ్య విమర్శలు కూడా ఘాటుగానే వినిపిస్తున్నాయి.
తాజాగా కోమటిరెడ్డి అనుచరుల పై నల్లగొండ బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి, కంచర్ల భూపాల్ రెడ్డి (Bhupal Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి అనుచరులు గుమ్ముల మోహన్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని భూపాల్ రెడ్డి అన్నారు. ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన భూపాల్ రెడ్డి.. బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్ముల మోహన్ రెడ్డి వక్ఫ్ బోర్డ్, దళితులు, ఇతర ప్రభుత్వ భూములు కబ్జా చేసి సర్వే నెంబర్లు మార్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు.
కోమటిరెడ్డి అనుచరుల కబ్జాలకు సంబంధించిన సాక్షాలు తమ వద్ద ఉన్నాయన్న కంచర్ల భూపాల్ రెడ్డి.. వాటిని ఇప్పుడు బయటకి తీస్తే రాజకీయ కక్ష సాధింపులుగా భావిస్తారనే ఉద్దేశంతో ఆగుతున్నామని అన్నారు.. కానీ ఎన్నికలు ముగిశాక న్యాయబద్ధంగా కోర్టుకు వెళ్లి శిక్షపడేలా చేస్తానని పేర్కొన్నారు కంచర్ల భూపాల్ రెడ్డి..
నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు కనీసం 10,000 మందితో సభ పెట్టలేని కోమటిరెడ్డి తనపై విజయం సాధిస్తారని చెప్పడం హాస్యాస్పదమన్నారు కంచర్ల భూపాల్ రెడ్డి.. కోమటిరెడ్డి రౌడీలను తన వెంట వేసుకుని తిరుగుతూ.. నేను రౌడీలను వెంటేసుకుని తిరుగుతున్నానని ఆరోపించడం సరికాదని పేర్కొన్నారు.. ఎవరు ఎలాంటి వారో త్వరలో బయట పడుతుందన్న కంచర్ల భూపాల్ రెడ్డి.. ఈనెల 30న జరిగే ఓటింగ్, డిసెంబర్ 3న జరిగే లెక్కింపులో తెలిసిపోతుందని తెలిపారు..