రాష్ట్రంలో బెల్ట్ షాపులపై చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే తెలంగాణ (Telangana) సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy).. రాష్ట్రంలోని బెల్ట్ షాపుల క్లోజ్ కు ప్రణాళికలు సిద్దం చేస్తున్న విషయం తెలిసిందే.. మరోవైపు బెల్ట్ షాపుల విషయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.. రహదారుల్లో డాబా హోటల్స్ లా రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయని.. దీనికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మండిపడ్డారు..
బెల్ట్ షాపుల కారణంగా ఎంతోమంది యువకులు మద్యానికి బానిసగా మారి మరణించారని.. వారి కుటుంబాలు అనాధాలుగా మారాయని.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మునుగోడు మండలంలోని 26 గ్రామాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించిన వెంకట్ రెడ్డి.. బెల్ట్ షాపులు మూసివేత, గ్రామాల అభివృద్ధిపై చర్చించారు..
బెల్ట్ షాపుల విషయంలో చాలా సీరియస్ గా ఉంటానని తెలిపిన రాజగోపాల్ రెడ్డి.. మద్యపానానికి తాను వ్యతిరేకం కాదు.. కానీ ఎక్కడబడితే అక్కడ లిక్కర్ దొరకడం వల్ల యువత చెడిపోతుందని మండిపడ్డారు.. చట్ట ప్రకారం బెల్ట్ షాపులు అమ్మడానికి వీలులేదని పేర్కొన్నారు. బెల్టు షాపుల నిర్మూలనలో గ్రామాలలో ఉన్న నాయకులు సహకరించాలని.. వాటిని బంద్ చేయించాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు..
తన పదవి పోయిన పర్వాలేదు.. బెల్ట్ షాపులు మాత్రం మూసివేయాల్సిందేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.. ఈ విషయంలో రాజీ పడేదిలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో తనకు సహకరించిన వారికి మాత్రమే ప్రాముఖ్యత ఉంటుందని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. బెల్ట్ షాపు ఉద్యమం మునుగోడు నుంచే మొదలవ్వాలన్న ఆయన.. బెల్ట్ షాపులు మూసివేయాలని ప్రతి గ్రామంలో దండోరా వేయించండని తెలిపారు. ప్రతి గ్రామంలో 10మందితో ఒక కమిటీ వేయాలని.. అందులో నలుగురు మహిళలు ఉండేలా చూడాలని రాజగోపాల్ రెడ్డి సూచించారు.