పార్టీ మారినా, మళ్లీ కాంగ్రెస్ (Congress)లో చేరినా కేసిఆర్ (KCR) నియంత పాలనను గద్దే దించడమే తన ఏకైక లక్ష్యమని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో కొట్లాడానన్నారు. ఎక్కడ కూడా మునుగోడు ప్రజలు తల దిలించుకునేలా చేయలేదన్నారు.
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కొద్ది రోజులు కాంగ్రెస్ ను వదలి వెళ్లి వెళ్లినా సరే మీరు తలదించుకునే పని తాను చేయలేదని కార్యకర్తలతో అన్నారు. ఆ మూడు నెలలు కేసీఆర్‌ను నిద్రపోనివ్వలేదని చెప్పారు.
ఒక ఎమ్మెల్యేను ఓడింంచేందుకు కేసీఆర్.. ప్రభుత్వం యంత్రాంగం, వందమంది ఎమ్మెల్యేలను తీసుకు వచ్చారని అన్నారు. అది నిజం కాదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ను మీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చానన్నారు. కాంగ్రెస్ తనకు రాజకీయ జన్మనిచ్చిందన్నారు. ఏ రాజకీయ సంచలనం జరగాలన్నా.. రాజకీయ పెను తుఫాను రావాలన్నా మునుగోడు గడ్డమీది నుంచే జరుగుతుందన్నారు.
చిరుమర్తి లింగయ్య మోసం చేసి వెళ్లిపోయాడన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు గెలుస్తాడా అని అడిగారు. తాను అమ్ముడుపోయిన వ్యక్తినైతే మళ్లీ కాంగ్రెస్‌లోకి ఎలా వస్తానని ప్రశ్నించారు. ఆనాడు ఎంపీగా తనను పార్లమెంటుకు పంపిచారని, అప్పుడు తెలంగాణ గొంతు వినిపించి రాష్ట్రం తీసుకు వచ్చేందుకు కష్టపడ్డానని వెల్లడించారు.
కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఒక కుటుంబం చేతిలోకి పోయిందన్నారు. ఆ కుటుంబాన్ని గద్దే దించేందకు పోరాటం చేస్తున్నానన్నారు. అధికారంలో ఉన్న లేకపోయినా తన సొంత డబ్బులతో పేద ప్రజలకు సహాయం చేశానన్నారు. తనను కొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లోకి రావాలని తనను వేల మంది కార్యకర్తలు, నాయకులు అడిగారని చెప్పారు.
మునుగోడు ప్రజల కోసం తన పదవిని వదిలిపెట్టానన్నారు. తన చేతిలో ఉన్న రాజీనామా అస్త్రాన్ని వదిలితే ప్రగతి భవన్ గోడలు బద్దలయ్యాయన్నారు. తన రాజీనామా వల్లే గట్టుప్పల్ మండలాన్ని ఏర్పాటు చేశారన్నారు. చండూరును రెవిన్యూ డివిజన్ చేశారన్నారు. చౌటుప్పల్ కు వంద పడకల ఆసుపత్రి ఇచ్చారన్నారు.
కాంగ్రెస్ తన సొంతిల్లు అన్నారు. తాను మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తే అందులో తప్పేముందన్నారు. ఆస్తులు వదులుకుంటున్నా… అవమానాలు భరిస్తున్నానన్నారు. కుటుంబం మొత్తం బాధపడినా.. కేసీఆర్ ను గద్దే దించేందుకే అని అన్నారు. తాను గజ్వేల్‌లో పోటీ చేస్తానని ఏఐసీసీకి చెప్పానని వెల్లడించారు. లక్ష కోట్లు అప్పు చేసి కట్టిన కాళేశ్వరం కూలిపోతోందన్నారు, ధరణి పోర్టల్ ద్వారా పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని విమర్శలు గుప్పించారు.