తెలంగాణ (Telangana) కాంగ్రెస్ (Congress) ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) వారసురాలు పొలిటికల్ ఎంట్రీకి సిద్దం అయ్యినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న ఆయన తన కూతురుని రంగంలోకి దింపేందుకు రంగం సిద్ధం చేసుకొన్నట్లు ప్రచారం జరుగుతోంది..
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కూతురు శ్రీనిధి (Srinidhi)ని నల్లగొండ (Nalgonda) ఎంపీగా పోటీ చేయించాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన నేతలంతా ఎంపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు పార్లమెంట్ఎన్నికల్లో గెలుపు అవకాశాలు హస్తం వైపే ఉన్నాయన్న ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో నల్లగొండ సీటుకు డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే ఈ నియోజక వర్గం నుంచి బరిలో నిలవడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఈ క్రమంలో జిల్లాలో ఎప్పటినుంచో చక్రం తిప్పుతున్న కోమటిరెడ్డి ఆయన కూతురి కోసం ప్రయత్నాలు మొదలెట్టారని ప్రచారం కూడా జరిగింది.
అనూహ్యంగా కోమటిరెడ్డి కుటుంబం నుంచి పవన్ అనే వ్యక్తి ధరఖాస్తు చేసుకొన్నారు. అంతేగాకుండా నల్గొండ సీటు కోసం జానారెడ్డి కుమారుడు రఘు వీర్ సైతం దరఖాస్తు చేసుకొన్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం చివరి వరకు పోరాటం చేసి.. త్యాగానికి సిద్ధమైన, పటేల్ రమేష్ రెడ్డి కూడా లైన్లో ఉన్నారు. దీంతో నల్లగొండ టికెట్‌పై రాజకీయవర్గాలలో ఆసక్తినెలకొంది.