బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తే తాను ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) సవాల్ చేశారు. తన సవాల్ ను స్వీకరించడానికి బీఆర్ఎస్ నుంచి ఎవరైనా ముందుకు రావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ (Hyderabad) లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి.. బీఆర్ఎస్ అంటే బొందల రాష్ట్ర సమితి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసారి కాంగ్రెస్ (Congress) పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.
కేసీఆర్ (KCR) లాగా తాము దుబారా ఖర్చులు చేయమన్నారు వెంకట్ రెడ్డి. ‘‘దళితులకు 10 లక్షలు అన్నారు. అందరికీ ఇచ్చేసరికి ఎంత టైం పడుతుంది? తెలంగాణలో ఉద్యోగుల జీతాలు 15వ తారీఖున ఇస్తున్నారు. జార్ఖండ్ వంటి రాష్ట్రంలో కూడా 1వ తేదీనే పడుతున్నాయి. ధనిక రాష్ట్రం అని గొప్పలు చెప్పే కేసీఆర్ 16 నెలల నుంచి జీతాలు ఆలస్యంగా ఇస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో నిధులు దోచేశారు’’ అంటూ విమర్శలు చేశారు. తెలంగాణలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉందన్న వెంకట్ రెడ్డి.. కేసీఆర్ అనారోగ్యంతో ఉంటే విద్యుత్ సమస్యలపై మంత్రులు కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) ఎందుకు సమీక్షలు చేయడం లేదని ప్రశ్నించారు.
తాము అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. లేకపోతే, తమలాంటి సీనియర్ నేతలంతా ప్రభుత్వం నుంచి వెళ్లిపోతామని తెలిపారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి హామీలనే అమలు చేస్తోందని, కావాలంటే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి తెలంగాణ మంత్రులను అక్కడకు తీసుకెళ్లి చూపిస్తామన్నారు కోమటిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ టికెట్లను అమ్ముకుంటుందని హరీష్ రావు చేసిన కామెంట్స్ హాస్యాస్పదంగా ఉన్నాయని, ముందు బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఎద్దేవ చేశారు.
ఐటీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఉంటే ఇంకా ఎక్కువ కంపెనీలు వచ్చేవన్న ఆయన.. బీఆర్ఎస్ లాలూచి వల్ల కొన్ని వెనక్కి పోతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో వచ్చిన ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, సెజ్ ల వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. కేసీఆర్ ఇంకా కొత్తగా ఎన్ని స్కీములు వదిలినా ప్రజలు నమ్మరని.. దళితుల భూములు లాక్కున్నారని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పూర్తిగా వైఫల్యం చెందిందని.. పరీక్షల నిర్వహణ చేత కావడం లేదని అన్నారు వెంకట్ రెడ్డి.