తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి.. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. టాలీవుడ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.. సినిమా వాళ్ళ నుంచి ఇప్పటి వరకు ఎవరూ ఫోన్ చేయలేదని, దిల్ రాజు ఒక్కడే ఫోన్ చేశారని తెలిపారు.
పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆనందం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అమెరికా ఈజ్ గ్రేట్.. అమెరికన్ రోడ్స్ ఈజ్ గ్రేట్ అని పొగడ్తలతో ముంచేసిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komati Reddy Venkat Reddy)..నాకు రోడ్లు భవనాలు శాఖ ఇచ్చినందుకు థాంక్స్ అని తెలిపారు.. ఇక్కడి రోడ్లను కూడా అలాగే మార్చడానికి కృషి చేస్తానని వెల్లడించారు..
మరోవైపు అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద బ్యూటిఫికేషన్ పనులు చేపడతామని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.. ఈ రోజు తొమ్మిది ముఖ్య ఫైల్స్ పై సంతకాలు చేసినట్టు పేర్కొన్నారు.. తన నియోజకవర్గ పరిధిలోని రోడ్లను 100 కోట్లతో నాలుగు లైన్లుగా మార్చబోతున్నామని.. ఇందుకు తనకున్న పరిచయాలతో ఢిల్లీ నుంచి నిధులు తీసుకువస్తానని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హామీ ఇచ్చారు.
ఎల్బీనగర్ మల్కాపురం వరకు, మల్కాపురం నుంచి సూర్యాపేట వరకు 6 లైన్ల రోడ్డు పనులు త్వరలో ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు వెల్లడించిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. వీటి విషయంలో పది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత వస్తుందని క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కంటే ముందే విజయవాడకు వెళ్లే విధంగా రోడ్లను తీర్చిదిద్దుతామని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు..