రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత.. ఆయా శాఖలు చెందిన మంత్రులు ఒక్కొక్కరుగా వారికి కేటాయించిన శాఖలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ (Konda Surekha) ఆదివారం బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం అటవీ శాఖ కార్యకలాపాలపై తొలి సమీక్ష నిర్వహించారు.
ఇప్పటిదాకా తెలంగాణ (Telangana)కు హరితహారం ద్వారా జరిగిన పచ్చదనం పెంపు, వచ్చే ఏడాది లక్ష్యాలపై కొండా సురేఖ ఆరా తీశారు. కంపా నిధుల సాధన, ఈ పథకం ద్వారా చేపట్టిన పనులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు అధికారులు, అటవీ శాఖ (Forest Department) పథకాలు, పనులపై ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా జంతువుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రకటించిన, ఎక్స్ గ్రేషియా పెంపుపై తొలిసంతకం చేశారు మంత్రి కొండా సురేఖ.
ఈమేరకు జంతు బాధితుల (Animal victims) ఎక్స్ గ్రేషియా రూ. 5లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక రెండో సంతకంగా.. ఇతర రాష్ట్రాల నుంచి ఏనుగులను తెచ్చెందుకు అనుమతిస్తూ ఉన్న ఉత్తర్వులపై సంతకం చేశారు కొండా సురేఖ. ఈ సందర్భంగా అటవీ, దేవాదయ శాఖలో ఉన్న ఖాళీల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇక తన పరిధిలోని శాఖల సిబ్బంది, అధికారులు నిజాయితీగా పనిచేయాలని కోరిన కొండా సురేఖ.. త్వరలోనే శాఖల వారీగా పూర్తి స్థాయి సమీక్షా సమావేశాలు చేపడతామని తెలిపారు. ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వానికి అందరం సహకరించి.. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సురేఖ కోరారు.. అనంతరం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో తయారు చేసిన పోస్టర్లను ఆవిష్కరించారు.