గత ప్రభుత్వ ప్రధాన నేతల ఆస్తులపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి(Minister) కొండా సురేఖ(Konda Surekha) డిమాండ్ చేశారు. వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadasi) సందర్భంగా వరంగల్(Warangal)లోని బట్టల బజార్ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం ఆమె సందర్శించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి తనకు ఓటు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రిగా ఆలయ భూముల కబ్జాపై కచ్చితంగా చర్య తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే గిరిజనుల సమ్మక్క సారక్క జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ మహా జాతరను మంత్రి సీతక్కతో కలిసి తాను విజయవంతం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి తీరుతుందని వెల్లడించారు.
ఇక ప్రభుత్వం ఇచ్చిన శ్వేతపత్రం వివాదాస్పదం చేస్తున్న బీఆర్ఎస్.. ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. అధికారంలోకి రాకముందు వారి ఆస్తులు ఎంత.. అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాలన అనంతరం వారి ఆస్తుల వివరాలపైనా శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుందని మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు.