రాజస్థాన్(Rajasthan)లోని కోటా(Kota)లో ఆదర్శ్ రెసిడెన్సీ బాయ్స్ హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. లక్ష్మణ్ విహార్‌లోని ఆదర్శ్ రెసిడెన్సీలో అగ్ని ప్రమాద విషయాన్ని తెలుసుకున్న కోట జిల్లా యంత్రాంగం అప్రమత్తమై వెంటనే సహాయక చర్యలను చేపట్టింది.
కున్హారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ల్యాండ్మార్క్ సిటీ ప్రాంతంలో ఉదయం 6.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని కోట (సిటీ) సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమృత దుహాన్ తెలిపారు. ప్రాథమిక విచారణ ప్రకారం, ఐదు అంతస్తుల హాస్టల్ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ ట్రాన్స్ ఫార్మర్‌లో షార్ట్ సర్క్యూట్ అగ్నిప్రమాదానికి దారితీసినట్లు తెలుస్తోంది.
ఫోరెన్సిక్ బృందం కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయాలపాలైన ఎనిమిది మంది విద్యార్థుల్లో ఇద్దరికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. మంటలకు అప్రమత్తమై భవనంపైనుంచి దూకడంతో ఓ విద్యార్థికి గాయాలతో పాటు కాలు విరిగినట్లు సమాచారం.
వారందరినీ చికిత్స నిమిత్తం మహారావ్ భీమ్ సింగ్ (ఎంబీఎస్) ఆసుపత్రిలో ప్రాథమిక వైద్య చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. ఈ భవనంలో 61 గదులకు మంటలు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. రెండు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గంట వ్యవధిలో మంటలను ఆర్పివేశాయని ఎస్పీ దుహాన్ తెలిపారు.
కోట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, అగ్నిమాపక భద్రతా నిబంధనలను పాటించనందుకు హాస్టల్‌కు సీలు చేసినట్లు అగ్నిమాపక అధికారి వ్యాస్ తెలిపారు. కోట-సౌత్, కోటా-నార్త్‌లోని దాదాపు 2,200 హాస్టళ్లకు ఇప్పటికే ఫైర్ సేఫ్టీ మార్గదర్శకాలను పాటించనందుకు నోటీసులు అందాయని, ఈ హాస్టళ్లపై త్వరలో చర్యలు తీసుకుంటామని రాకేష్ వ్యాస్ చెప్పారు.