తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ (KRMB) కీలక సూచనలు చేసింది. కృష్ణా నదిలో(Krishna Water) నీటి నిల్వలు తగినంతగా లేవని, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాలని తెలిపింది. రెండు జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి నుంచి తెలంగాణకు (Telangana) 35, ఆంధ్రపదేశ్‌కు (Andraprades) 45 టీఎంసీల నీటిని కేటాయిస్తూ, రెండు ప్రాజెక్టుల్లో కనీస నీటిమట్టం ఉండేలా చూడాలని పేర్కొంది.
కేఆర్ఎంబీ సభ్యకార్యదర్శి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కృష్ణా బోర్డు ఛైర్మన్ శివ నందన్ కుమార్ తో పాటు తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, ఏపీ జలవనరులశాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి పాల్గొని కీలక విషయాలపై చర్చించారు.
బోర్డు సభ్య కార్యదర్శి రాయిపురే మాట్లాడుతూ ఈ సంవత్సరం ఉమ్మడి జలాశయాల్లోకి నీరు అంతగా చేరలేదని, ప్రస్తుతం సాగర్, శ్రీశైలంలో కేవలం 82.78 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలంటే బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు అమల్లోకి వస్తే మంచిదని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు.
శ్రీశైలం జలాశయం నుంచి 30 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 15 టీఎంసీల జలాలు కావాలని కేఆర్‌ఎంబీ ముందు ప్రతిపాదించినట్లు వివరించారు. బచావత్ ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీల కేటాయింపులో మార్పు లేదని నారాయణరెడ్డి చెప్పారు. మరోవైపు తెలంగాణ 45 టీఎంసీలను ఈ సంవత్సరం వినియోగించుకోగా 15 టీఎంసీలు రాష్ట్ర పరిధిలోని జలాశయాల్లో నిల్వ ఉన్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ 95 టీఎంసీలు వినియోగించుకోగా 50 టీఎంసీలు నిల్వ ఉన్నట్టు ఏపీ ఈఎన్సీ తెలిపారు. శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ జల విద్యుదుత్పత్తి కోసం విడుదల చేస్తున్న నీటిని ఆ రాష్ట్ర కోటా కిందకు చేర్చాలని ఏపీ కోరగా.. అందుకు తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇకపోతే కృష్ణా జలాల పునఃపంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విఘాతం కలిగే పరిస్థితి వస్తే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ప్రధాని మోదీతో పాటు ఇతర ప్రభుత్వ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని ఈఎన్సీ నారాయణరెడ్డి వివరించారు.