తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana assembly elections) వేళ ప్రచారం ఊపందుకుంది. నేతలు ప్రచార సభలతో హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. రాహుల్‌గాంధీ(Rahul Gandhi) తెలంగాణ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై లక్షకోట్ల అవినీతి చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్(Ktr) ఘాటుగా స్పందించారు.
అవినీతి గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్(x)లో సెటైర్లు విసిరారు. ‘టికెట్లు అమ్ముకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలే ఈడీకి ఫిర్యాదు చేశారు. ఓటుకు నోటు కేసులో ఆయన ఇప్పటికే పట్టుబడ్డాడు. స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ అవసరం లేదని గాంధీజీ అన్నారు.
ఇలాంటివారు కాంగ్రెస్‌లో ఉంటారని ఆయన ఆనాడే ఊహించారేమో?‘ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘పీసీసీ పోస్టును రూ.50 కోట్లకు అమ్మారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఒకరు పీసీసీ పోస్టును విక్రయిస్తే మరొకరు కొనుగోలు చేశారు. ఇంత అవినీతి పార్టీలో ఉన్న రాహుల్.. అక్రమాలపై మాట్లాడటం హాస్యాస్పదం’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
మరోవైపు ఇవాళ జగిత్యాలలో రాహుల్ మాట్లాడుతూ దోపిడీ సొమ్మంతా బీఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళ్తోందని ఆరోపించారు. ‘ప్రజల తెలంగాణ కోరుకుంటే దొరల తెలంగాణ వచ్చింది.. ఈ ఎన్నిక దొర తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఓబీసీ కులగణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు.