తెలంగాణ (Telangana) లో అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. కొన్ని చోట్ల బీఆర్ఎస్ (BRS) లో గ్రూపు రాజకీయాలు కొనసాగగా… ఇప్పుడు ఆ గ్రూపు రాజకీయాలకు తెర దింపే అవకాశాన్ని సీఎం (CM) కేసీఆర్, మంత్రి కేటీఆర్ (KTR) సమర్థవంతంగా ఉపయోగించు కొంటున్నారు.
ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో జనగామ టికెట్ గురించి జరిగిన రగడ చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టికెట్ కేటాయించకుండా జనగామ సీటును పెండింగ్ పెట్టింది బీఆర్ఎస్ అధిష్టానం. తాజాగా ఆ ఉత్కంఠ వీడింది. జనగామ నియోజకవర్గ బీఆర్ ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి బెర్త్ ఖరారు అయినట్టు సమాచారం.
కాగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మరో ఇద్దరు ఆశావహులతో మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో మినిస్టర్స్ క్వార్టర్స్‌లో భేటీ అయ్యి సయోధ్య కుదిర్చారు. జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో పాటు.. ఆశావహులు శ్రీరాములు, కిరణ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
మొత్తానికి జనగామ టికెట్ పై బీఆర్ఎస్ గ్రూపు రాజకీయాలకు నేటితో తెరపడనుంది.. తాజాగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, నోటిఫికేషన్ విడుదల తేదీ కూడా స్పష్టం కావడంతో బీఆర్ ఎస్ అధిష్ఠానం వేగంగా నిర్ణయాలు చేపట్టింది.