తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ఈరోజు షురూ అయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం 11గంటలకే సభ ప్రారంభం కాగా కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం సభను డిసెంబర్ 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ(Akbar Uddin Owaisi) ప్రకటించారు.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్పీ నేత కేశవరావు అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ పేరును ప్రతిపాదించారు. మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి కేసీఆర్కు బలం చేకూర్చారు. మిగిలిన కమిటీని ఎంపిక చేసే బాధ్యతను కేసీఆర్‌కు అప్పగిస్తూ శాసనసభా పక్షం ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయం తెలిసిందే.
మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్‌కు తుంటి కీలు సర్జరీ కావడంతో ప్రమాణ స్వీకారానికి రాలేదు. ఇదే అంశంపై కేటీఆర్ స్పందిస్తూ.. ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరొక రోజు సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని కోరారు. కేసీఆర్ వెంట ఆస్పత్రిలో ఉన్నందున ఈరోజు తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి తాను హాజరు కాలేనని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఎమ్మెల్యేగా మరో రోజు ప్రమాణస్వీకారానికి అనుమతి ఇవ్వాలని కేటీఆర్ కోరారు.
ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ అసెంబ్లీలో ప్రమాణం చేయించారు. తొలుత సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయగా, మంత్రులు, ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు.