బీఆర్‌ఎస్ (BRS) పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి (55) నిన్న సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. కాగా ఆయన పార్థివదేహానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నివాళులు అర్పించారు.. సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటునట్టు తెలిపారు.
కేసీఆర్ వెంట 14 ఏళ్లు సైనికుడిలా ఉండి పని చేసిన సంపత్ రెడ్డి మరణం ప్రతి బీఆర్‌ఎస్ కార్యకర్తను కలచి వేసిందని కేటీఆర్ తెలిపారు. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నిబద్ధతతో విజయవంతం చేశారన్నారు. సంపత్‌రెడ్డి (Sampath Reddy) కుటుంబానికి కేసీఆర్, పార్టీ శ్రేణుల తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. సంపత్‌రెడ్డి మరణం పార్టీకి తీరని లోటన్న కేటీఆర్, వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.
సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన కేటీఆర్.. చిన్న వయసులోనే సంపత్ మృతి చెందడం తనను కలచివేసిందని తెలిపారు. మరోవైపు హనుమకొండ (Hanamkonda)లోని తన నివాసంలో సంపత్ రెడ్డి, సోమవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. జనగామ (Janagama) జిల్లా చిల్పూరు మండలం రాజవరం గ్రామానికి చెందిన సంపత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడిగా బీఆర్‌ఎస్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు..