లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS)ను రద్దు చేస్తామన్న కాంగ్రెస్(Congress) హామీ ఏమైందని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. మార్చి 6వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వం దిగిరాక పోతే తాము న్యాయ పోరాటం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటపై కాంగ్రెస్ నేతలు ఎందుకు కట్టుబడి లేరని నిలదీశారు. మార్చ్ 31 లోపు ఎల్ఆర్ఎస్ కట్టమని ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు. రూ.20వేల కోట్ల భారం ప్రజలపై వేసేందుకు సిద్ధమయ్యారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని దుయ్యబట్టారు. ఎల్ఆర్ఎస్ పైన కాంగ్రెస్ వైఖరి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. గతంలో ఎల్ఆర్ఎస్ కోసం తమ ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించిందన్న కేటీఆర్ రూ.1000తో రిజిస్టర్ చేశామని చెప్పారు. ఆ రోజు తమని తప్పుబడుతూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోర్టుకెళ్లారని గుర్తుచేశారు.
అదేవిధంగా సీఎల్పీ నాయకుడిగా భట్టి విక్రమార్క ఎల్ఆర్ఎస్ చెల్లించవద్దన్నారని, ఉత్తమ్ కుమార్ రెడ్డి ‘‘నో ఎల్ఆర్ఎస్-నో టీఆర్ఎస్’’ అంటూ నినాదాలు చేశారని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటపై ఎందుకు కట్టుబడి లేరని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పై వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఈనెల 6వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో ధర్నాకు పిలుపునిచ్చారు కేటీఆర్. హైదరాబాద్లోని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని చెప్పారు. అదేవిధంగా 7వ తేదీన కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేస్తామని కేటీఆర్ వెల్లడించారు.