Telugu News » KTR : బ్యారేజీల్లో సమస్యలు కామన్..!

KTR : బ్యారేజీల్లో సమస్యలు కామన్..!

సాగునీటి ప్రాజెక్టుల కోసం లక్షా 70 వేల కోట్ల వరకు ఖర్చు చేశామన్నారు కేటీఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరాన్ని నాలుగున్నరేండ్లలో పూర్తి చేశామని తెలిపారు.

by admin
ktr-presentation-on-telangana-development

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. లక్షల కోట్ల ప్రజాధనం వృధా అయిందని ప్రతిపక్షాలు కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నాయి. అసలు, ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి భారమే తప్ప ఉపయోగం లేదని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించారు. తొమ్మిదిన్నరేండ్ల తెలంగాణ ప్రస్థానంపై హైదరాబాద్‌ లోని హోటల్‌ కాకతీయలో ప్రజంటేషన్‌ ఇచ్చారు. తలసరి ఆదాయంలో దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో తెలంగాణ ఉందని పేర్కొన్నారు.

ktr-presentation-on-telangana-development

సాగునీటి ప్రాజెక్టుల కోసం లక్షా 70 వేల కోట్ల వరకు ఖర్చు చేశామన్నారు కేటీఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరాన్ని నాలుగున్నరేండ్లలో పూర్తి చేశామని తెలిపారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు అని చెప్పారు. కాల్వలు తవ్వి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశామని వివరించారు. ప్రాజెక్టులపై అనవసర రాజకీయాలు చేయొద్దని.. కావాలనే బద్నాం చేయొద్దని అన్నారు. ఈ సందర్భంగా బ్యారేజీల్లో సమస్యలు రావడం సర్వసాధారణమని పేర్కొన్నారు కేటీఆర్. ప్రకాశం, ధవళేశ్వరం, కడెం జలాశయాల్లోనూ సమస్యలు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

నాగార్జున సాగర్‌ కట్టిన తర్వాత కూడా లీకేజీ సమస్యలు వచ్చాయన్న కేటీఆర్… రెండేండ్ల క్రితం శ్రీశైలం పంపులు కూడా నీట మునిగాయని వివరించారు. రాజకీయాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేయొద్దన్నారు. రైతును రాజును చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్న ఆయన… రాష్ట్రంలో అన్నాదాతల ఆత్మహత్యలు తగ్గాయని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని తెలిపారు. 24 గంటల కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని.. సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నామని చెప్పారు.

తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందిందని తెలిపారు కేటీఆర్. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేనన్నారు. కేసీఆర్‌ వచ్చిన తర్వాతే కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయని చెప్పారు. రాష్ట్రం పచ్చని పంటలతో కళకళలాడుతున్నదని వెల్లడించారు. కేంద్రంలో దుర్మార్గమైన ప్రభుత్వం ఉందని.. తెలంగాణకు అప్పులు పుట్టకుండా కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ కు అధికారం ఇస్తే.. కరెంట్ ఉండదని అన్నారు.

2014కు ముందు తెలంగాణ ఎలా ఉందేదో గుర్తు చేసుకోవాలన్నారు కేటీఆర్. అలాగే, ఇప్పుడు ఎలా ఉందో గణాంకాలు, ఫొటోలతో సహా వివరించారు. ‘‘తెలంగాణలో పంటల దిగుబడి పెరిగింది. ధాన్యం ఉత్పత్తిలో అన్నపూర్ణగా మారింది. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగు నీటిని అందిస్తున్నాం. దీనికోసం కోసం రూ.37 వేల కోట్లు ఖర్చు చేశాం. ప్రస్తుతం మిషన్‌ భగీరథ ద్వారా 58 లక్షల కుటుంబాలకు నీరు అందిస్తున్నాం. ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయి. దీని స్ఫూర్తితో కేంద్రం ప్రభుత్వం హర్‌ ఘర్‌ జల్‌ పథకాన్ని ప్రారంభించింది’ అని అన్నారు. ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు కేటీఆర్.

You may also like

Leave a Comment