బీజేపీ (BJP) తో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు మంత్రి కేటీఆర్ (KTR). అందులో భాగంగానే గోషా మహల్, కోరుట్ల, కరీంనగర్ నియోజకవర్గాల్లో డమ్మీ అభ్యర్థులను పెట్టారని విమర్శించారు. హైదరాబాద్ (Hyderabad) తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. బీజేపీ, కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుందని మండిపడ్డారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అని తెలిపారు.
గోషా మహల్ లో రాజాసింగ్ ను, కరీంనగర్ లో బండి సంజయ్ ను ఓడిస్తామన్నారు కేటీఆర్. బీజేపీకి తెలంగాణలో ఒక్క సీటు లేకుండా చేస్తామని.. రైతు బంధు నిధులు విడుదల చేస్తే అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న రేవంత్.. పీఎం కిసాన్ యోజనపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. డీకే శివకుమార్ ఏడు గంటల కరెంట్ అంటున్నారు, రేవంత్ రెడ్డి మూడు గంటలు ఇస్తామంటున్నారు.. కరెంటు కావాలా? కాంగ్రెస్ కావాలా? అనేది తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలని సూచించారు.
రైతు బంధు కొత్త స్కీమ్ కాదన్న ఆయన.. కొనసాగుతున్న పథకమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర కోసం 2013 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారని గుర్తు చేశారు. ఆయన పోరాటంతోనే కేంద్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిందన్నారు. గత 14 ఏళ్లుగా నవంబర్ 29న బీఆర్ఎస్ దీక్షా దివస్ నిర్వహిస్తోందని తెలిపారు. ఈసారి కూడా ఘనంగా నిర్వహించుకోవాలని పార్టీ శ్రేణులను కోరారు. నవంబర్ 29 ఎక్కడి వారు అక్కడ తోచిన విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. దేశ విదేశాల్లో కూడా దీక్షా దివస్ నిర్వహణ కొనసాగుతుందని చెప్పారు.
కాంగ్రెస్ ఔట్ డేటెడ్ పార్టీ అని.. ఎంత వాగినా లాభం లేదని అన్నారు కేటీఆర్. తమ నేతల మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ సర్కార్ 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందని.. దేశంలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలకు భర్తీ చేసిన రాష్ట్రం ఉందా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరానికి వెయ్యి ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు. కానీ, బీఆర్ఎస్ తాము సంవత్సరానికి 16 వేలు ఇచ్చామని తెలిపారు. ఉద్యోగాలపై మాట్లాడుతున్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి జీవితంలో ఉద్యోగం చేశారా అని సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 4న స్వయంగా అశోక్ నగర్ వెళ్లి జాబ్ క్యాలెండర్ ను రూపొందిస్తానని హామీ ఇచ్చారు కేటీఆర్.