పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా లబ్ది పొందాలని కాంగ్రెస్ (CONGRESS) పార్టీ తక్కుగూడ(Tukkuguda)లో జనజాతర పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ(Rahul Gandi), కేసీ వేణుగోపాల్(Kc Venugopal), రాష్ట్ర వ్యవహారాల దీపాదాస్ మున్షీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Cm Revanth reddy), రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యారు.
ఈ సభా వేదికగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల కోసం రెడీ చేసిన మేనిఫెస్టోను విడుదల చేశారు. తాజాగా కాంగ్రెస్ సభా, ఎన్నికల మేనిఫెస్టోపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్స్ (X) వేదికగా స్పందించారు.
శనివారం తుక్కుగూడలో నిర్వహించినది జనజాతర కాదని, అబద్ధాల హామీల పాతర అని కేటీఆర్ సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారెంటల పేరిట గారడీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల వేళ న్యాయ్ పేరిట నయా నాటకానికి తెరతీశారా? అని ప్రశ్నలు గుప్పించారు.
తెలంగాణకు తీరని అన్యాయం చేసిన ఆ పార్టీ.. ఇప్పుడు వచ్చి న్యాయ్ అంటే నమ్మెదెవరు? అని అడిగారు. నమ్మిఓట్లేసిన నాలుగు కోట్ల ప్రజలను 4 నెలలుగా నయవంచన చేస్తుంది కాంగ్రెస్. అసత్యాలతో అధికారంలోకి వచ్చి.. అన్నదాతలను ఆత్మహత్యల పాలు చేస్తున్నది. నేతన్నల బలవర్మణాలకు కారణమవుతోంది. గ్యారెంటీలకు పాతరేసి.. అసత్యాలతో జాతర చేస్తోంది. రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి.. అధికారంలోకి వచ్చి నరకం చూపిస్తున్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో సాగునీరు లేక రైతులు పంట నష్టపోతున్నారు. రుణమాఫీ లేక రైతులు అప్పుల పాలువుతున్నారని విమర్శల వర్షం కురిపించారు.