జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం (Kulgam) జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇప్పటివరకు ఐదుగురు ఉగ్రవాదులు (Terrorists) హతమయ్యారు. వీరు లష్కరే తొయీబాకు (Lashkar-E-Taiba) చెందిన ఉగ్రవాదులుగా తెలుస్తోంది.
కుల్గాం జిల్లా దంహాల్ హంజిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ఇప్పటివరకు ఐదుగురు ముష్కరులను మట్టుబెట్టామని కశ్మీర్ జోన్ పోలీసులు సామాజిక మాధ్యమం X(ట్విట్టర్) ద్వారా వెల్లడించారు.
గురువారం సాయంత్రం 4 గంటలకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ కాల్పులతో ప్రారంభమై ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌గా మారింది. ఇరుపక్షాల మధ్య శుక్రవారం ఉదయం మరోసారి కాల్పులు జరిగాయి. గత నెలలో ఇదే ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు.
యూరీ సెక్టార్‌లోని ఇదే ప్రాంతం గుండా పదేపదే చొరబాటు ప్రయత్నాలు జరుగుతున్నాయని కల్నల్ రాఘవ్ తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో శాంతికి విఘాతం కలిగించేందుకు, ఉగ్రవాదులను పంపేందుకు పాక్ విశ్వప్రయత్నాలు చేస్తోందన్నారు. కానీ మన భద్రతా దళాలు పటిష్టమైన కట్టుదిట్టమైన నిఘా ఉంచుతున్నాయని, చొరబాటు యత్నాలను తిప్పికొట్టి భారత్ దీటుగా సమాధానం ఇస్తోందని వెల్లడించారు.