‘కుమారి ఆంటీ’ (Kumari Aunty).. ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ‘మీది మొత్తం రూ.1000 అయింది.. రెండు లివర్లు ఎక్స్‌ట్రా’ అని చెప్పిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆమె క్యాంటిన్‌ను కాస్త పోలీసులు మూసివేశారు.
హైదరాబాద్(Hyderabad) కేబుల్ బ్రిడ్జి(Cable Bridge) కి సమీపంలో కుమారి అనే మహిళ తన భర్తతో కలిసి కొంతకాలంగా ఫుడ్ బిజినెస్ చేస్తోంది. అయితే, ఇటీవల వైరల్ అయిన వీడియోతో కొన్ని ఛానళ్లు ఆమెతో ఇంటర్వ్యూలు సైతం చేశాయి. దీంతో జనం క్యూ కట్టారు. కొందరు సెలెబ్రిటీలు కూడా అక్కడ వెళ్లి భోజనం చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి.
బిగ్‌బాస్ రాబోయే సీజన్‌లో కుమారి ఆంటీని తీసుకెళ్లాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. దీంతో మంచి కంటెంట్ కోసం ఉవ్విల్లూరుతున్న మీమర్స్, మిగిలిన ఛానళ్లు ఆమెతో ఇంటర్వ్యూ చేయడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. అప్పటికీ ‘మీవల్లే మాకు సమస్య..’ అంటూ కుమారి ఆంటీ భర్త చెప్తూనే ఉన్నారు. తమ వ్యాపారాన్ని కొనసాగించలేకపోతున్నామని వాపోయాడు.
కాగా, అసలుకే ఎసరైనట్లు వచ్చిన వారంతా రోడ్లపైనే బైక్స్‌ను పెడుతుండడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఓ మహిళ కారు దిగి అక్కడ గొడవ పడిన వీడియో ఒకటి వైరల్ అయింది. భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. సోషల్ మీడియా ఛానళ్ల అత్యుత్సాహం వల్ల ‘కుమారి ఆంటీ’ ఫుడ్ బిజినెస్‌ను పోలీసులు మూసివేయించారు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడ ఫుడ్ అమ్మడానికి వీళ్లేదని హెచ్చరించారు. దీంతో కుమారి ఆంటీ తనకు న్యాయం చేయాలని కోరారు. ‘సోషల్ మీడియా ద్వారానే నాకు పేరొచ్చింది. ఇప్పుడు కూడా మీడియానే నాకు సాయం చేయాలి. వాహనాలు పక్కన పెట్టాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దని నా కస్టమర్లకు చెబుతున్నా. ఇక్కడ చాలా మంది బిజెనెస్ చేస్తున్నారు. అయితే పోలీసులు నా స్టాల్‌ను మాత్రమే మూసివేయాలంటున్నారు.’ అంటూ వాపోయింది.