కాంగ్రెస్‌ను ఎంపీ సీట్లు అడిగామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు (Kunamneni Sambashiva Rao) అన్నారు. ఆయన శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము పోటీ చేయాలనుకుంటున్న సీట్ల వివరాలను ఆ పార్టీకి ఇచ్చామని వెల్లడించారు. కేజ్రీవాల్ అరెస్ట్ అప్రజాస్వామికమన్న ఆయన మార్చి 21ని చరిత్రలోనే బ్లాక్ డే అని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోడీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయనలో హిట్లర్ ఉన్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ ఓ నియంత అంటూ మండిపడ్డారు. ఘోరీ, ఔరంగజేబు లాంటి వాళ్ళను చూశాం ఇప్పుడు మోడీ వ్యవహారం అలాగే ఉందన్నారు. బాండ్‌ల రూపంలో వేల కోట్లు బీజేపీ కొట్టేసిందని ఆరోపించారు. బీజేపీ వసూలు చేస్తే తప్పులేదు కానీ మిగతా వారు చేస్తే అరెస్టులు చేయిస్తారా? అని మండిపడ్డారు.
డిప్యూటీ సీఎంను అరెస్టు చేసిన నాడే కవిత, కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. లొంగిపోతాడని కేజ్రీవాల్‌ను వేధించారని దుయ్యబట్టారు. ఇండియా కూటమి నుండి బయటకు రాకపోవడంతోనే ఆయనను అరెస్ట్ చేశారని ఆరోపించారు.బాండ్‌ల రూపంలో వచ్చిన డబ్బంతా అక్రమమే కదా? అని కీలక వ్యాఖ్యలు చేశారు. వాటిపైనా ఎందుకు చర్యలు లేవనిని ప్రశ్నించారు.
బందిపోట్ల నుంచి దొంగలు దోచుకున్నట్లు బాండ్ల రూపంలో బీజేపీ దోచుకుంటోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను బీజేపీ సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతోందని విమర్శించారు. కలిసి వచ్చే వారితో కలవడంలేదని చెప్పారు. బీఆర్ఎస్ పని అయిపోయిందన్న కూనంనేని కాంగ్రెస్ నిలబడాలని ఆకాంక్షించారు. బీజేపీకి 400 సీట్లు దాటాయి అంటే చాలా ప్రమాదకరమని, తెలంగాణలో కాంగ్రెస్ మనుగడ కష్టమని అభిప్రాయపడ్డారు.