అసెంబ్లీ(Assembly)లో సీపీఐ(CPI) కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Koonanneni Sambasivarao) బీఆర్ఎస్ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమని అన్నారు. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తామని బీఆర్ఎస్ శ్రేణులు అనడం మంచిది కాదని తెలిపారు. సభలో అర్థవంతమైన చర్చ జరగాలని… సభ్యులు వ్యక్తిగత దూషణలు చేయకుండా చర్చించాలని కూనంనేని సూచించారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. 2023లో కేవలం 11 రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచిందన్నారు. అసెంబ్లీని ఎక్కువ రోజులు నడిపేలా చూడాలన్నారు. 2020లో కేవలం 17 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరిగాయని గుర్తుచేశారు. వైఎస్ఆర్ ఆనాడు ఇచ్చిన హామీలను నెరవేర్చారని తెలిపారు. హామీల అమలుకు డబ్బు ఒక్కటే ఇబ్బంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా.. హామీల అమలుకు కేంద్రం నుంచి రాష్ట్రానికి చాలా నిధులు రావాలన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లో రెండు హామీలను కొత్త ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించాలని కూనంనేని డిమాండ్ చేశారు. పాత ప్రభుత్వం ఎందుకు విఫలమైందో గుర్తించి కాంగ్రెస్ పనిచేయాల్సిన అవసరముందన్నారు.
అయితే బీఆర్ఎస్ ఓడిపోవడానికి అనేక కారణాలున్నాయన్నారు కూనంనేని. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమ పార్టీగా వచ్చిన బీఆర్ఎస్ స్వేచ్ఛను హరించిందని ఆరోపించారు. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే భావన కలిగేలా మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడారని.. ఇది మంచిది కాదని హితవు పలికారు.
శాసనసభలో మంచి వాతావరణం ఉండాలని కూనంనేని కోరారు. అసెంబ్లీలో నిర్మాణాత్మక చర్చలు జరగాలని సూచించారు. గత బడ్జెట్‌పై చర్చ ఒక్కరోజులో మొక్కుబడిగా నిర్వహించినట్లు తెలిపారు. గతంలో వైఎస్ చెప్పిన హమీలన్నీ నెరవేర్చారని, ఇప్పుడూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందనే నమ్మకం ఉందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ధీమా వ్యక్తం చేశారు.