పొలిటికల్ రీ ఎంట్రీపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్(Lagadapati Rajagopal) క్లారిటీ ఇచ్చారు. సోమవారం రాజమండ్రి(Rajahmundry)లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్లతో భేటీ అయ్యారు. త్వరలో లోక్సభ, ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రధాన్యత సంతరించుకుంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్న ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. అయితే, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అక్కడ రాజకీయ వేడి పెరిగింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ అనేక మార్పులు చేర్పులు చేస్తోంది.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిన తర్వాత సీనియర్ రాజకీయ నేతలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో లగడపాటి రాజగోపాల్ రాజమండ్రి పర్యటన రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్ర విభజనతోనే నా రాజకీయ జీవితం ముగిసిందన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమిళనాడు తరహాలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ పోయిందని లగడపాటి అన్నారు. రాబోయే ఎన్నికల్లో కేవలం ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని చెప్పారు.
రాష్ట్ర విభజనతోనే నా రాజకీయ జీవితం ముగిసిందని ఆయన పేర్కొన్నారు. మా భేటీలో ఎలాంటి రాజకీయ పరిణామాలకు సంబంధించిన అంశాలు లేవన్నారు. రాజమండ్రి వస్తే ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్లను కలవడం సాధారణం అని తెలిపారు.