మేం బీజేపీ (BJP) ని అప్రోజ్ అవ్వడమేంటి.. 2018లో ఆపార్టీనే తమతో పొత్తుకు హింట్ ఇచ్చిందని అప్పటి బీజేపీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎంపీ లక్ష్మణ్ (Lakshman) అన్నారని సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ (KTR) చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. ఈ క్రమంలో లక్ష్మణ్ స్పందించారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన ఆయన కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు.
వారసత్వ, కుటుంబ రాజకీయాలతో సంబంధమున్న ఏ పార్టీని కూడా బీజేపీ ప్రోత్సహించదని అన్నారు లక్ష్మణ్. అలాంటిది బీఆర్ఎస్ తో తామెందుకు కలుస్తామని అన్నారు. ఎన్నికల్లో నైతికంగా గెలిచేవారినే యోధులు అంటారని… అవకాశవాద రాజకీయాలతో గట్టెక్కే పరాన్నజీవిగా బీఆర్ఎస్ ముద్ర వేసుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్-కాంగ్రెస్-ఎంఐఎం కుమ్మక్కు రాజీకీయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
బీజేపీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ఓటమి భయంతో బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు లక్ష్మణ్. తెలంగాణ ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ పార్టీ పొత్తులతోనే కాలం వెల్లదీసిందని.. ప్రతి ఎన్నికల్లో వివిధ పార్టీలతో తెరచాటు ఒప్పందాలు, పొత్తులు పెట్టుకుందని విమర్శించారు. జీహెచ్ఎంసీ, మునుగోడు ఉప ఎన్నికలే ఇందుకు నిదర్శనమన్నారు.
బీఆర్ఎస్ అవసరాల కోసం పక్కదారులు తొక్కే పార్టీ అయితే.. బీజేపీ ఒక సిద్దాంతానికి కట్టుబడి ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటుందని స్పష్టం చేశారు లక్ష్మణ్. బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్పడం కల్వకుంట్ల కుటుంబానికి అలవాటేనని తమ తప్పులను ఎత్తిచూపితే కండ్లమంటతో బట్టగాల్చి మీదేసేలా నిందలు, దుష్ప్రచారం చేస్తుంటుందని మండిపడ్డారు. కేటీఆర్ చేసిన పొత్తు వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజం కాదని తేల్చి చెప్పారు లక్ష్మణ్.