అయోధ్య (Ayodhya)లో జనవరి 22న నిర్వహించే రామ్ లల్లా (Ram Lalla) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి (consecration ceremony) విపక్ష నేతలు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటామని కాంగ్రెస్ ప్రకటించింది. తాజాగా ఈ కార్యక్రమానికి తాను హాజరుకాబోనని రాష్ట్రీయ జనతా దళ్ (RJD) చీఫ్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ వెల్లడించారు.
అంతకు ముందు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రామ మందిర ప్రారంభోత్సవానికి తాను హాజరుకావడం లేదని వెల్లడించారు. ఆలయ ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం పంపినందుకు ట్రస్టు సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి తాను ఇప్పుడు హాజరు కాలేనని వెల్లడించారు.
ప్రారంభోత్సవం పూర్తయిన తర్వాత దర్శనానికి వస్తానని చెప్పారు. అప్పటి వరకు ఆలయ నిర్మాణం కూడా పూర్తవుతుందని తెలిపారు. అయోధ్యలో తన తదుపరి పర్యటనలో శ్రీ రామున్ని ప్రార్థిస్తానని అన్నారు. అటు సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాను కూడా ఇప్పుడే ప్రాణ ప్రతిష్టకు హాజరు కాలేనని చెప్పారు.
ఆలయ ప్రారంభోత్సవం తర్వాత మరో రోజు తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకుంటానని వివరించారు. ఇది ఇలా వుంటే ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమానికి రాజకీయ నేతలు, సినీ తారలు, క్రికెటర్లు, సాధువులు మొత్తం 7000 మందికి పైగా ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.