విజయవాడ కనకదుర్గ గుడి (Durga Temple) కేశఖండనశాల (Tonsuring Hall) పక్కన కొండ చరియలు విరిగి పడ్డాయి. కొండచరియలు (Land Sliding) విరిగిపడిన ప్రాంతంలో పార్కింగ్ చేసిన కొన్ని బైకులు ధ్వంసం అయ్యాయి. అదృష్టవశాత్తు అక్కడ ఎవరు మనుషులు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
కొండచరియలు విరిగి రోడ్డుపై పడటంతో వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
విజయవాడలో రాత్రి సమయంలో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో కొండచరియనాని ఉండటంతో కూలిపోయినట్లు తెలుస్తోంది. దుర్గగుడి కొండచరియలు విరిగిపడిన దాఖలాలు గతంలో లేవని స్థానికులు చెబుతున్నారు. తాజాగా కేశఖండనశాల పక్కన భారీగా కొండచరియలు విరిగిపడటంతో స్థానిక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఘటన సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై విరిగి పడిన కొండచరియలను పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించే చర్యలు చేపట్టారు. కొండ చరియలు విరిగిపడిన సమయంలో రోడ్డుపై వాహనాలు రాకపోకలు తక్కువగా ఉన్నాయి. దీంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు చెప్పారు.
కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఎవరూలేరని తమ దృష్టికి వచ్చిందని దుర్గగుడి ఈవో భ్రమరాంబ చెప్పారు. సోమవారం కావడంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య తక్కువగా ఉందని, దీనికితోడు కొండచరియలు విరిగిపడిన ప్రాంతం భక్తులు నిలబడే ప్రదేశం కాదని, అందుకే ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని చెప్పారు. పాదచారులు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని దుర్గ గుడి ఈవో చెప్పారు.