ఉత్తరాఖండ్ లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్తున్నాయి. ముఖ్యంగా గౌరీకుండ్ ప్రాంతంలో జరిగిన బీభత్సంలో అనేకమంది గాయపడ్డారు. పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. కేదార్ నాథ్ ఆలయానికి సమీపంలోని యాత్రా స్థలమైన ఇక్కడ దాదాపు 10 నుంచి 12 మంది నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడమో, లేదా శిథిలాల్లో చిక్కుకునిపోయి ఉంటారని భావిస్తున్నట్టు రుద్రప్రయాగ్ రాజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు తెలిపారు. అకస్మాత్తుగా విరిగి పడిన కొండచరియల కారణంగా మూడు షాపులు ధ్వంసం కాగా వీటిలో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురితో బాటు 13 మంది గల్లంతయినట్టు ప్రాథమికంగా తెలిసిందని వారు చెప్పారు.
ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే తమ సహాయక బృందాలు ఇక్కడికి చేరుకున్నాయని, అయితే భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు. బాధితుల్లో చాలామంది నేపాలీలని స్థానికులు తెలిపారు. కొందరు బాధితులు మందాకినీ నదిలో కొట్టుకుపోయి ఉండవచ్చునని కూడా వారు చెప్పారు.
గల్లంతయిన వారిని రక్షించేందుకు నిర్విరామంగా సహాయక బృందాలు శ్రమిస్తున్నాయని రుద్రప్రయాగ్ ఎస్పీ డా. విశాక వెల్లడించారు. వర్షాకాల సీజన్ లో ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడడం సహజమేనన్నారు. అయితే ఎక్కడినుంచో వచ్చి ఉపాధికోసం ఇక్కడ దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నవారు కూడా గల్లంతు కావడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
కొండ చరియలు విరిగిపడుతున్న కారణంగా కొన్ని జాతీయ రహదారులను మూసి వేయడం జరుగుతోందని, అందువల్ల యాత్రికులు, భక్తులు తమ కేదార్ నాథ్ యాత్రపై పునరాలోచించుకోవడం మేలని విశాక అభిప్రాయపడ్డారు. గౌరీ కుండ్ లోని పార్వతీ మాత ఆలయాన్ని సందర్శించుకోవడానికి కూడా చాలామంది వస్తుంటారు.