భారత ఆర్థిక వ్యవస్థ 7.5 శాతం కంటే ఎక్కువగా వృద్ధి చెందుతోందని ప్రధాని మోడీ (PM Modi) అన్నారు. దేశం త్వరలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ (largest economy)గా అవతరించనుందని వెల్లడించారు. 2024 నాటికి భారత్లో ప్రాథమిక ఇంధన డిమాండ్ రెట్టింపు అవుతుందని తెలిపారు. రాబోయే ఐదేండ్లలో ఇంధన రంగంలో 67 బిలియన్ డాలర్ల పెట్టుబడులను భారత్ చూడనుందని పేర్కొన్నారు.
గోవాలో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్ రెండో ఎడిషన్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మోడీ మాట్లాడుతూ….. 2030 నాటికి దేశం తన రిఫైనింగ్ సామర్థ్యాన్ని సంవత్సరానికి 254 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 450 ఎంఎంపీటీఏకి పెంచాలని భావిస్తోందని వెల్లడించారు. భారత ఇంధన రంగ వృద్ధిలో పాలుపంచుకోవాలని ఇన్వెస్టర్లను కోరారు.
2025 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ మౌలిక సదుపాయాల కోసం కేటాయిస్తున్న రూ. 11 లక్షల కోట్లలో ఎక్కువ భాగం ఇంధన రంగానికి వెళ్తుందని స్పష్టం చేశారు. ఈ మొత్తం రైల్వేలు, రోడ్వేలు, జలమార్గాలు, వాయుమార్గాలు లేదా గృహాల్లో ఆస్తులను సృష్టిస్తుందని తెలిపారు. అభివృద్ధి క్రమంలో శక్తి అవసరం ఉంటుందన్నారు. అందువల్ల శక్తి సామర్థ్యాన్ని విస్తరించే దిశగా ప్రయత్నాలను భారత్ ప్రోత్సహిస్తుందని వివరించారు.
గత పదేళ్లలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ 1.5 శాతం నుంచి 12 శాతానికి పెరిగిందన్నారు. రాబోయే ఏడాదిలో ఇథనాల్ కలిపిన పెట్రోల్, 25 శాతానికి చేరనుందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ సంస్కరణల కారణంగా దేశీయ గ్యాస్ ఉత్పత్తి పెరగుతోందన్నారు. దేశ ప్రైమరీ ఎనర్జీ మిక్స్ లో గ్యాస్ శాతాన్ని 6 నుంచి 15 శాతానికి తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.