కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project)లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ పై.. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దుమ్మెత్తి పోసిన విషయం తెలిసిందే.. ఈ అంశం పై నేతలు ఎంతో హంగామా సృష్టించారు. అయితే హస్తం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతోన్నాయి.. ఈ నేపథ్యంలో బీజేపీ (BJP) రాజ్య సభ సభ్యుడు లక్ష్మణ్.. కాంగ్రెస్ ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి.. మేడిగడ్డ బ్యారేజ్ (Medigadda Barrage)పై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేసినట్టు లక్ష్మణ్ (Laxman) గుర్తు చేశారు. డ్యాం సేఫ్టీ అథారిటీ బీజేపీ చొరవతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పరిశీలించి నివేదిక ఇచ్చిందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన లక్ష్మణ్.. మేడిగడ్డ బ్యారేజ్ ను పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు.
ప్రాజెక్ట్ డిజైన్ లోపం ఉందనే వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో.. గత ప్రభుత్వాన్ని పూర్తి వివరాలు అడిగితే ఇవ్వలేదని తెలిపిన లక్ష్మణ్.. ఆ సమయంలో రేవంత్ రెడ్డీ.. సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అంటే కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని ఆరోపించారు. మంత్రులు గుంపుగా వెళ్ళారు. అఖిల పక్షం పై మండిపడ్డారని వెల్లడించారు.. కాళేశ్వరం అవినీతిలో పాలుపంచుకొన్న వారెవరిని వదిలిపెట్టమని చెప్పిన కాంగ్రెస్ నేతలు.. అధికారంలోకి వచ్చాక.. ఒక్క అధికారిపై కూడా చర్యలు తీసుకోలేదని లక్ష్మణ్ మండిపడ్డారు..
ప్రాజెక్ట్ పై ఇచ్చిన పాయింట్ ప్రజెంటేషన్.. నేపవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని ఎద్దేవా చేశారు.. ప్రస్తుతం ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై అనేక అనుమానాలున్నట్టు లక్ష్మణ్ పేర్కొన్నారు.. రాష్ట్రాన్ని దోచుకు తిన్నందుకు బీఆర్ఎస్ ను ప్రజలు శిక్షించారని.. వాళ్లు తిన్న సొమ్ముని కక్కించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిదేనని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ను రాజకీయంగా లొంగ తీసుకునేందుకు కాంగ్రెస్ ఇలా చేస్తుందా? అని ప్రశ్నించారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ప్రజల ముందు ఈ ప్రభుత్వం దోషిగా నిల్చోవాల్సి వస్తుందని లక్ష్మణ్ తెలిపారు.