తెలంగాణ (Telangana)లో భారీ విజయం సాధించిన కాంగ్రెస్ (Congress) పార్టీకి సీఎం ఎవరనేది అతిపెద్ద పజిల్ లా మారింది. ఫలితాలు వెలువడి ఐదు రోజులు కావస్తున్న ఇప్పుడు సీఎం ఎవ్వరన్నది అంతు చిక్కడం లేదు. సోమవారమే ముఖ్యమంత్రి పేరును ప్రకటిస్తారని.. ప్రమాణ స్వీకార కార్యక్రమం సైతం అదే రోజు ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా సీఎం ఎంపిక వాయిదా పడటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ఇక సీఎం పదవి కోసం ఉత్తమ్, భట్టి డిమాండ్ చేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. సీఎం ఇవ్వకపోతే డిప్యూటీతో పాటు, భార్య పద్మావతికి మంత్రి పదవి ఇవ్వాలని ఉత్తమ్ అడుగుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.. మరోవైపు డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ పదవి ఇవ్వాలని భట్టి విక్రమార్క హైకమాండ్‌ను కోరినట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో భట్టికి డిప్యూటీ ఇస్తే తన పరిస్థితి ఏంటని దామోదర్ రాజనర్సింహా అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పదవుల విషయంలో పేచీ పెడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం అభ్యర్థి ఎంపికపై జాప్యం జరుగుతున్నది. మరోవైపు రేవంత్‌రెడ్డి (Revanth Reddy)నే సీఎం చేయాలని హైదరాబాద్ (Hyderabad) ఎల్లా హోటల్, రాజ్‌భవన్ ముందు కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగిస్తూ సీఎల్పీ చేసిన తీర్మానాన్ని అధిష్టానానికి పంపిన ఇన్ఛార్జ్లు.. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు.
భేటీ అనంతరం తెలంగాణ సీఎం అభ్యర్థి పేరును ఇవాళ ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేసులో ఉన్న సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తినకు పయనం అయ్యారు. మరోవైపు సీనియర్ నేతల సడెన్ హస్తిన టూర్ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా సుదీర్ఘ విరామం తర్వాత అధికారం చేపడుతున్న కాంగ్రెస్ నలుగురిలో నవ్వులపాలు కాకుండా చూసుకుంటే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు..