Telugu News » Leaders Confident on Victory : గెలిచేది మేమే… అగ్ర నేతల ధీమా..!

Leaders Confident on Victory : గెలిచేది మేమే… అగ్ర నేతల ధీమా..!

ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ పై మంత్రి కేటీఆర్ (KTR) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓ పక్క పోలింగ్ జరుగుతుంటే మరో పక్క ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసి ప్రభావితం చేయడమేంటని ప్రశ్నించారు.

by Ramu

తెలంగాణ (Telangana)లో పోలింగ్ ముగిసిన తర్వాత పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ (Exitpolls) విడుదల చేస్తున్నాయి. వాటిపై అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ పై మంత్రి కేటీఆర్ (KTR) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓ పక్క పోలింగ్ జరుగుతుంటే మరో పక్క ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసి ప్రభావితం చేయడమేంటని ప్రశ్నించారు.

leaders Expressed conference over their victory

ఎగ్జిట్ పోల్స్ కు అంత శాస్త్రీయత ఉందని తాను అనుకోవడం లేదన్నారు. అసలు ఎగ్జిట్ పోల్స్ అంటే పెద్ద చెత్త అంటూ కొట్టి పారేశారు. ఎగ్జిట్ పోల్స్ తప్పని తేలితే డిసెంబర్ 3 తర్వాత మీడియా క్షమాపణలు చెబుతుందా అని ప్రశ్నించారు. ఎగ్జిట్ పోల్స్ తమకు వ్యతిరేకంగా ఉండటం ఇదే తొలిసారి కాదన్నారు.

2018లో కేవలం ఒక్క సంస్థ మాత్రమే సరైన వివరాలను అందించిందన్నారు. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ చూసి బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. మొదట 80కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని అనుకున్నట్టు చెప్పారు. కానీ 70 సీట్లతో అధికారంలోకి రాబోతున్నట్టు పేర్కొన్నారు.

మరోవైపు పోలింగ్ సమయంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లే పోలీసులు నడుచుకున్నారని ఆరోపించారు. పోలీసుల ముందే విచ్చల విడిగా మద్యం, డబ్బు పంపిణి జరిగిందని ఆరోపణలు గుప్పించారు.

పలు నియోజకవర్గాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. నాగర్జున సాగర్ ప్రాజెక్టు వద్ద జరిగిన ఘటనను వ్యతిరేకిస్తున్నట్టు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు ఏ మాత్రమూ సరికాదన్నారు. దుందుడుకు విధానంతో ఎపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదని మండిపడ్డారు.

మరోవైపు డిసెంబర్ 3న ప్రజల తెలంగాణ ఆవిష్కృతమవుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణకు పదేండ్లుగా పట్టిన పీడ తొలగిపోనుందని పేర్కొన్నారు. ఓటమి ఖాయమని తెలిసినప్పుడే నియోజక వర్గం మార్చారని తెలిపారు. బీఆర్ఎస్ కు 25 కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రాదన్నారు.

సునామీ వస్తే.. గడ్డపారలే కొట్టుకుపోతాయన్నారు. అలాంటిది గడ్డిపోచ ఓ లెక్కా అంటూ ఫైర్ అయ్యారు. గతంలో పోలింగ్ ముగియగానే కేసీఆర్ మీడియా ముందుకు వచ్చే వారన్నారు. కానీ ఇప్పుడు ఓటమి ఖాయమని తెలియడంతోనే ముఖం చాటేశారంటూ ఎద్దేవా చేశారు. త్వరలోనే కేటీఆర్ కూడా అమెరికాకు వెళ్లిపోతారన్నారు.

తెలంగాణ చైతన్యవంతమైందని కామారెడ్డి ప్రజలు నిరూపించారన్నారు. తెలంగాణ ఉద్యమంలో డిసెంబర్ 3కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఆరోజే శ్రీకాంత్‌చారి తుదిశ్వాస విడిచారని గుర్తు చేశారు. శ్రీకాంత్‌ చారి ఆత్మ బలిదానంతోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందన్నారు. డిసెంబరు 3న దొరలు తెలంగాణ అంతమై ప్రజల తెలంగాణ ఆవిష్కృతమవుతుందని స్పష్టం చేశారు.

అధిష్ఠానం సూచన ప్రకారం సీఎల్పీ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ ఏర్పాటు గురించి ఆ సమావేశంలో చర్చిస్తామన్నారు. అనంతరం తేదీలను ప్రకటిస్తామన్నారు. ప్రొఫెసర్ కోదండ రామ్ కు కీలక బాధ్యతలను అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఎంఐఎం ప్రస్తుతం బీజేపీతో ఉందని, అందుకే మైనార్టీలను ప్రభుత్వంలో కలుపుకొని పోతామన్నారు.

You may also like

Leave a Comment